ఎల్బీనగర్, నవంబర్ 1: రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని, అన్ని సర్వేలూ అదే ఖాయమని తేల్చాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్‌లో చేరి ఎల్బీనగర్ టికెట్ ఆశించి భంగపడ్డ ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్, మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీప్రసన్న దంపతులను బీఎన్‌రెడ్డినగర్‌లోని వారి నివాసంలో మంత్రి హరీశ్‌రావు కలిశారు. గులాబీ కండువాలు కప్పి వారిని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రామ్మోహన్‌గౌడ్ ఉద్యమకాలం నుంచి తమతో కలిసి పనిచేశారని చెప్పారు. రెండుసార్లు ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చిందని, దురదృష్టవశాత్తు స్వల్ప మెజార్టీలో ఓడిపోయారని తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో 11 మంది కార్పొరేటర్లను గెలిపించిన ఘనత రామ్మోహన్గౌడ్దేనని చెప్పారు. పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరి టికెట్ ఆశించారని, అక్కడ టికెట్ దక్కలేదని తెలిపారు. పార్టీ ప్రతినిధిగా తాను బాధ్యత తీసుకుంటున్నానని, రాష్ట్ర స్థాయిలో ఓ మంచి పదవిని ఇవ్వడంతోపాటు రామ్మోహన్‌గౌడ్ అనుచరులకు కూడా పార్టీపరంగా సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఎల్బీనగర్ నియోజకవర్గం రెండు లేదా మూడు నియోజకవర్గాలుగా విభజన అవుతుందని, రామ్మోహన్‌గౌడ్‌కు, లక్ష్మీప్రసన్నకు అందులో అవకాశం దక్కుతుందని భరోసా ఇచ్చారు. ఢిల్లీలో హైకమాండ్ ఉన్న పార్టీలు కావాలా, గల్లీలో ప్రజల మధ్య ఉండే పార్టీ కావాలా అని ప్రజలు ఆలోచిస్తున్నారని చెపారు.
సీఎం కేసీఆర్‌పై అభిమానం, నమ్మకం:రామ్మోహన్‌గౌడ్
సీఎం కేసీఆర్‌పై అభిమానం, నమ్మకంతో తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుతున్నామని ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్ చెప్పారు. పార్టీలో తమకు తగిన న్యాయం చేయాలని కోరామని, స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరినట్టు చెప్పారు. సీఎం కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకునేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మల్లారపు శాలినీతోపాటు ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వివిధ డివిజన్ల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.