ఖైరతాబాద్, అక్టోబర్ 23 : గిరిజనుల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్, ఆ వర్గాలనే దగా చేసిందని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మూడావత్ రాంబాల్ నాయక్ రేవంత్ సర్కార్‌పై మండిపడ్డారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎల్‌హెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గిరిజనులపై కాంగ్రెస్ వివక్షాపూరిత ధోరణిని ఆయన ఖండించారు. రాష్ట్రంలోని 55 నియోజకవర్గాల్లో గిరిజనుల ఓట్లు 60వేలకుపైగా ఉన్నాయని, కాంగ్రెస్ గెలిచిన ప్రతి సీటు లంబాడీలు ఇచ్చిన భిక్షేనని అన్నారు. చివరకు సీఎం రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడానికి తమ ఓట్లే కీలకమయ్యాయని గుర్తుచేశారు. కేవలం ఓట్ల కోసం లంబాడీలను వాడుకుంటున్నారని, చట్టసభల్లో రాజకీయ ప్రాతినిథ్యం కల్పించడం లేదని వాపోయారు. లంబాడీలు మాట్లాడే భాష గోర్బోలిని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 22న చలో హైదరాబాద్ నిర్వహించి, తమ సత్తా చూపిస్తామని స్పష్టంచేశారు. సమావేశంలో ఎల్‌హెచ్‌పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శులు గుగులోతు హరినాయక్, భూక్యా కోట్యానాయక్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రామావత్ సక్రు నాయక్, తదితరులు పాల్గొన్నారు.
అధిష్ఠానం ఆమోదంతోనే ఎమ్మెల్యేల చేరికలు ; ఫిరాయింపులపై పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
హైదరాబాద్, అక్టోబర్ 23(నమస్తే తెలంగాణ): ‘హైకమాండ్‌తో చర్చించిన తర్వాతే ఇతర పార్టీ ఎమ్మెల్యేలను మా పార్టీలో చేర్చుకున్నాం. ఇది సమిష్టి నిర్ణయం’ అని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ స్పష్టంచేశారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం సమిష్టి నిర్ణయమని తెలిపారు. సీఎం, డిప్యూటీ సీఎం, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, ఏఐసీసీ నాయకత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే చేర్చుకున్నట్టు వివరించారు. ఇతర పార్టీ నేతలు రావడంతో పాత కాంగ్రెస్ నేతలు ఇబ్బందులు పడుతున్న మాట నిజమేనని అంగీకరించారు.