ముషీరాబాద్, సెప్టెంబర్ 15: రాష్ట్ర నూతన సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టడం దేశం గర్వపడే నిర్ణయమని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు. ఇంతకాలం అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అంబేద్కర్‌ను వాడుకుంటే అందరివాడిగా గుర్తించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని చెప్పారు.
గురువారం విద్యానగర్‌లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెడుతూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ నేడు రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి సంబురాలు జరుపుకోనున్నట్టు తెలిపారు. బీజేపీకి చిత్తశుద్ది ఉంటే కేసీఆర్ స్పూర్తిగా ఏదో ఒక రాష్టానికి చెందిన అత్యున్నత సంస్థ, పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ శుక్రవారం గ్రామస్థాయి నుంచి అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి మద్దతు ర్యాలీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. త్వరలోనే సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతగా భారీ సభ నిర్వహిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కొల్లూరు వెంకట్, వరిగడ్డి చందు, నరేందర్, అశోక్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.