పెనుబల్లి, ఆగస్టు 31 : ఆసరా పింఛన్లు పెంచుతామని మాయమాటలు చెప్పి రాష్ట్రంలో ఉన్న 65 లక్షల మంది పింఛన్ లబ్ధిదారుల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటివరకు ఆ ఊసే ఎత్తకపోవడం బాధాకరమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ పేర్కొన్నారు.
ఆదివారం ఖమ్మంజిల్లా కల్లూరులో నిర్వహించిన పెన్షన్‌దారుల సన్నాహక సమావేశంలో రేవంత్ సర్కారుపై మందకృష్ణ నిప్పులు చెరిగారు. అబద్ధాలతో గద్దెనెక్కి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రిగా కొనసాగే నైతికహక్కు లేదని విమర్శించారు. సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లో లక్షలాది మంది పింఛన్‌దారులతో ‘సింహగర్జన’ సభ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. దీనిలో భాగంగానే జూలై 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సన్నాహక సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.