హైదరాబాద్, మే 28(నమస్తే తెలంగాణ): ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు మరో ఆరు నెలలు ఆలస్యం కానున్నాయా? రైతుభరోసా వేసి జూన్లో ఎన్నికలకు వెళ్లాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్ఐఆర్ బ్రేకులు వేసిందా? అదే జరిగేతే ఈ వానకాలానికి కూడా రైతు భరోసా ఇవ్వడం కష్టమేనా? రేవంత్ సర్కార్ మరోసారి రైతుల నోట్లో మట్టి గొట్టినట్టేనా? ఇప్పటికే పంట కొనుగోళ్లు సవ్యంగా జరుగక ఇబ్బందులు పడుతున్న రైతన్నలకు అదును మీద ఇవ్వాల్సిన పెట్టుబడి సహాయం కూడా అందకుండా పోతుందా? అంటే అవును అనే సమాధానమే వినిపిస్తున్నది. జూన్లో నిర్వహిద్దామనుకున్న ఎన్నికలు ఆలస్యం అవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుభరోసా నిధుల విడుదల విషయంలో వేచి చూసే ధోరణితో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
2024 జూన్లో ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం ముగిసింది. దాదాపు రెండేండ్ల నుంచి ఆశావహులు ప్రాదేశిక ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది జూన్లో రైతుభరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో వేసి, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని తొలుత కాంగ్రెస్ సర్కార్ లెక్కలు వేసుకున్నది. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ కారణంగా జూన్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం దాదాపు లేనట్టేనని భావిస్తున్నారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐఆర్ అమలుకు కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది.
జూన్ 25 నుంచి రాష్ట్రంలో ఎస్ఐఆర్ సర్వే ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటరు జాబితాను సరిచూసి ప్రక్షాళన చేస్తారు. బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్వోలు) ప్రతి ఇంటికీ మూడుసార్లు వెళ్లి ఓటర్ నమోదు, తొలగింపు ప్రక్రియను సమన్వయం చేస్తారు. జూలై 24న ఈ ప్రక్రియ ముగుస్తుంది. అక్టోబర్ ఒకటో తేదీన తుది జాబితా విడుదల చేస్తారు. అప్పటివరకు ఎన్నికల ప్రక్రియ చేపట్టడం కష్టమని అధికారులు చెప్తున్నారు. ఈ లెక్కన అక్టోబర్, లేదా నవంబర్లో జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉన్నది.
అధికారంలోకి వస్తే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుచేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. బీఆర్ఎస్తో మిగిలిన పార్టీలు మద్దతు ఇచ్చి ఆమోదం తెలిపాయి. అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఈ బిల్లు అలా ఉండగానే ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి… ఒకరోజు నామినేషన్లు కూడా స్వీకరించింది. అయితే, జీవోపై కోర్టులో నుంచి ప్రతికూల తీర్పు రావడంతో ఆ ప్రక్రియ వాయిదా పడింది. నోటిఫికేషన్ను ఎన్నికల కమిషన్ వెనక్కి తీసుకొన్నది.
బీసీ సామాజిక వర్గాలకు 42% రాజకీయ రిజర్వేషన్లు అమలు చేసిన తరువాతే పరిషత్తు ఎన్నికలకు వెళ్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతంలో ప్రకటించారు. ఈ అంశం కూడా పరిషత్తు ఎన్నికలకు మరో ప్రధాన అడ్డంకిగా మారింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన ఆధారంగానా? లేక తాజా జనాభా లెకలను ప్రామాణికంగా తీసుకొని రిజర్వేషన్లు ఖరారు చేయాలా? అనే అంశం మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు రిజర్వేషన్ల నోటిఫికేషన్ జారీ చేసే పరిస్థితి లేదు. కాబట్టి మరో ఆరు నెలలపాటు ఎన్నికలను వాయిదా వేయడమే మేలు అని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలిసింది.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాట్లకు నాట్లకు మధ్య రైతుబంధు అందిస్తే, రేవంత్రెడ్డి ప్రభుత్వం ఓట్లకు ఓట్లకు మధ్య రైతుభరోసా ఇస్తున్నదనే విమర్శలను ఎదుర్కొంటున్నది. ఓట్లు ఉంటేనే కాంగ్రెస్ సర్కార్కు రైతుభరోసా ఇవ్వాలనే ఆలోచన వస్తున్నదని రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓటర్లు, రైతుల చేతిలో చావుదెబ్బ తిన్న అధికార కాంగ్రెస్ త్వరలో పార్టీ గుర్తులపై నిర్వహించే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఇంకా దిగజారిపోయే అవకాశం ఉన్నదని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో రైతుభరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో వేసిన తరువాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది.
జూన్లో వానకాలం రైతుభరోసా నిధులు వేసి ఎన్నికలకు వెళ్లాలని అనుకున్నది. కానీ, ఎస్ఐఆర్ కారణంగా ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉండటంతో.. ఈసారి కూడా రైతుభరోసాను కూడా ఎగ్గొట్టాలని, అక్టోబర్లో యాసంగి రైతుభరోసా ఇచ్చి నవంబర్లో ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం.