హనుమకొండ, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అన్నదాతలపై ప్రకృతి పగ బట్టింది. ఎల్ నినో, ఇంకేదోగానీ రాష్ట్రంలో వానలు కురవడంలేదు. ఎప్పుడో ఒకసారి, ఎక్కడో ఒకచోట ఓ మోస్తరు తప్పితే సాగుకు సరిపడా వర్షాలు పడటంలేదు. రాష్ట్ర వ్యాప్తం గా ఇప్పటికీ లోటు వర్షపాతమే నమోదైంది. పంటలను కాపాడుకునేందుకు రైతులు బావు లు, బోర్లపైనే ఆధారపడుతున్నారు. తమకు ఉన్న భూమిలో కొంత విస్తీర్ణంలోనే వరి సాగు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సరిగా కరెంటు సరఫరా చేయకపోవడంతో పంటలకు నీరందడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగుకు 12 గంటల కరెంటు ఇస్తున్నామన్న ప్రభుత్వ ప్రకటనలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన కుదరడంలేదు.
రాష్ట్రంలో ఎక్కడా తొమ్మిదిన్నర గంటలకు మించి కరెంటు సరఫరా కావడంలేదు. లోడు, మరమ్మతుల పేరుతో ఈ సమయంలోనూ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు కోతలు పెడుతున్నది. నాట్లు వేసిన కొద్దిరోజులకే పంటలు ఎండిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సాగుకు సరిపడా కరెంటు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ తీరు ఇలాగే ఉంటే మున్ముందు ఇంకా ఇబ్బందులు తప్పవని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు సరఫరా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. అధికారికంగానే 12 గంటల కరెంటు సరఫరా ప్రక్రియను మొదలు పెట్టింది. పొద్దున ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు సాగుకు నిరంతరాయంగా సరఫరా చేయాల్సి ఉన్నా ఇది అమలు కావడంలేదు.
పొద్దున ఆరు గంటలకు సరఫరా మొదలుపెడుతున్నా సాయంత్రం ఐదున్నర గంటలకే నిలిపివేస్తున్నారు. మధ్యలో పలుసార్లు కోతలు పెడుతున్నారు. రోజూ రెండు, రెండున్నర గంటలపాటు సరఫరా నిలిచిపోతున్నది. కోతలతో కూడిన సరఫరాతో గరిష్ఠంగా తొమ్మిది గంటలకు మించి కరెంటు సరఫరా కావడంలేదు. సరఫరా చేసే సమ యం తక్కువగా ఉండటం, మధ్యలో ఎక్కువసార్లు కోతలు పెడ్తుండటంతో పంటలకు సరిపడా నీరు అందడంలేదు. వ్యవసాయానికి కరెంటు సరఫరాను మెరుగుపరిచే విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 15,776 మెగావాట్ల సరఫరా జరుగుతుంది. సరఫరాకు అదనంగా 2 వేల మెగావాట్ల డిమాండ్ ఉంటున్నది. ఇందుకు తగినట్టు సరఫరా లేకపోవడంతో అధిక లోడు పేరిట ప్రభుత్వం కరెంటు కోతలు విధిస్తున్నది. తక్కువ వానలతో జల విద్యుత్తు ఉత్పత్తి కనిష్ఠంగా ఉంటున్నది. సరిపడేంత బొగ్గు నిల్వలు లేకపోవడంతో కొత్తగూడెం, మణుగూరు, భూపాలపల్లి, మిర్యాలగూడలోని విద్యుత్తు కేంద్రాల్లోనూ తక్కువ ఉత్పత్తి జరుగుతున్నది. ఎల్ నినో పరిస్థితులతో వానలు రావని వాతావరణ శాఖ ముం దుగానే హెచ్చరించినా ప్రభుత్వం బొగ్గు నిల్వలను ఏర్పాటు చేసుకోవడంలో విఫలమైంది. ఇతర రాష్ర్టాల నుంచి కొనుగోలు చేసి సాగుకు కరెంటు సరఫరా చేసే విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతున్నది. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అనుకున్నా.. ఇతర రాష్ర్టాల్లోనూ కరెంటు లభ్యత ఉండదని విద్యుత్తు శాఖ ఉన్నతాధికారులే చెప్తున్నారు.
ప్రతికూల వాతావరణంతో వానకాలం పంటల సాగు కష్టతరంగా మారింది. ఎప్పుడో కొద్దిపాటి జల్లులు తప్పితే వానలు కురవడంలేదు. సాగు చేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కష్టపడి పారించిన కొన్ని గంటల్లోనే తడి ఆరిపోతున్నది. భిన్న వాతావరణ పరిస్థితుల్లో పగలు ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి. వేడి వాతావరణానికి తోడు గాలుల వల్ల పొలాల్లో నీరు వెంట వెంటనే ఆరిపోతున్నది. పంటలను కాపాడుకునేందుకు రైతులు పదేపదే నీరు సరఫరా చేయాల్సి వస్తున్నది. బావులు, బోర్లతో నీటి సరఫరా చేద్దామంటే కరెంటు ఉండటం లేదు. కరెంటు సరఫరా చేయలేక, సాగునీటి నిర్వహణలోనూ ప్రభుత్వ వైఫల్యంతో రాష్ట్రంలో వ్యవసాయం ఆగమవుతున్నది. గోదావరి వరద నీటిని తగిన సమయంలో వినియోగించే ఆలోచన చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోసి చెరువులు నింపితే జలవనరులతో పంటలకు నీటి సరఫరా ఉండేది. ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో ప్రాజెక్టులతో ఎక్కడా నీటి సరఫరా జరుగడంలేదు. పంటలను కాపాడుకునేందుకు రైతులు బోర్లు, బావులపైనే ఆధారపడుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 30 లక్షల వ్యవసాయ కరెంటు కనెక్షన్లు ఉన్నాయి. ప్రాజెక్టులు, కాలువల ద్వారా చెరువులకు నీటి సరఫరా లేకపోవడంతో పంటల కోసం మొత్తం బావులు, బోర్లపైనే ఆధారపడాల్సి వస్తున్నది. భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటుతుండటంతో కరెంటు అవసరం ఎక్కువగా ఉంటున్నది. రాష్ట్ర ప్రభుత్వం క్షేత్ర స్థాయి పరిస్థితులను పట్టించుకోవడంలేదు. కరువు పరిస్థితుల్లో కరెంటు డిమాండ్, సరఫరా, ఉత్పత్తి విషయాలను అస్సలు పట్టించుకోవడంలేదు. వానలు వస్తే అంతా బాగుంటుందనే నిర్లక్ష్య వైఖరితో రాష్ట్ర ప్రభుత్వం ఉంటున్నది. కరెంటు సరఫరాలో ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ రైతులను ఇబ్బందులు పెడుతున్నది.
అరకొర కరెంటు సరఫరాతో పంటలు ఎండిపోతున్నాయంటూ రాష్ట్రవ్యాప్తంగా రైతులు నిరసనలు చేపడుతున్నారు. సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తున్నారు. ప్రకృతే అంతా సర్దుబాటు చేస్తుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండటం సరికాదని అంటున్నారు. ప్రభుత్వం అరకొరగా కరెంటు సరఫరా చేయడంతో లోడు పెరిగి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు, మార్పిడి కోసం వారం పడుతున్నది. ఈ లోపు పంటలు ఎండిపోతున్నాయి.
సాగుకు కరెంటు సరఫరాలో రైతులు బీఆర్ఎస్ పాలనను గుర్తుచేసుకుంటున్నారు. కేసీఆర్ సర్కార్ దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో సాగుకు ఉచితంగా 24 గంటలు కరెంటు సరఫరాను మొదలు పెట్టిందని చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పది గంటల కరెంటు రావడమే కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వ్యవసాయ రంగానికి కేసీఆర్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. సాగునీరు, రైతు బంధు, పంటల కొనుగోలుతోపాటు నిరంతరం ఉచితంగా కరెంటు సరఫరా చేసింది.
రాష్ట్రంలో రైతులందరికీ 24గంటల విద్యుత్తు సరఫరా చేస్తున్నాం
-శనివారం సంగారెడ్డి సభలో రేవంత్రెడ్డి చెప్పిన మాట ఇది
కరెంట్ సరఫరాను ఎప్పుడు తీసేస్తరో, మళ్లీ ఎప్పుడు ఇస్తరో తెల్వదు. ఇప్పుడు వానలు సరిగాలేక ఇంకా పరేషాన్ ఉన్నది. కరెంటు సరిగా ఇస్తేనే అంతోఇంతో పంటలకు నీళ్లు పారియ్యగలుగుతం. కేసీఆర్ ఉన్నప్పుడు ఇంతగోస లేకుండే. కరెంట్ నిరంతర సరఫరా జరుగుతుండే. ఇష్టమచ్చినప్పుడు పోయి పారిచ్చుకునేటోళ్లం. ఇప్పుడు కరెంటు కష్టాలు తప్పడం లేదు.
– కే చిన్న రాజేశ్వర్, రైతు, మోర్తాడ్, నిజామాబాద్ జిల్లా
వ్యవసాయానికి ఇచ్చే కరెంటు పదిగంటలు కూడా సరిగ ఇస్తలేరు. పొద్దున్న ఇచ్చే సమయం సరిగా ఉండట్లేదు. పొద్దున ఇచ్చుడు చాలయ్యిందంటే ఎన్నిసార్లు పోతదో తెల్వదు. ఒక్కోసారి గంటల తరబడి కరెంటు రాని పరిస్థితులు ఉంటున్నయి. ఇప్పుడు వానలు సరిగా లేక బోర్లపైనే ఆధారపడ్డాం. ఇదే పరిస్థితి కొనసాగితే పంటలకు నీళ్లు పారియ్యడం కష్టమైతది. గతంలో ఇచ్చినట్టు కరంటిస్తే రైతులు ఇష్టమొచ్చినప్పుడు పంటలకు నీళ్లు పారిస్తరు. ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నం. ఇదే పరిస్థితి కొనసాగితే మరిన్ని కష్టాలు తప్పవనిపిస్తుంది. వ్యవసాయానికి సరిపడా కోతలు లేకుండా కరెంటు సప్లయి చేయాలి.
– రెంజర్ల మహేందర్, రైతు, కమ్మర్పల్లి, నిజామాబాద్
రైతులకు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేయడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుందో తెలియడం లేదు. ఒక పక్క వర్షాలు లేక బోర్లపై వ్యవసాయం చేద్దామంటే అరగంటకోసారి కరెంటు పోతున్నది. సబ్స్టేషన్ నుంచి ఇచ్చే కరెంటు లోవోల్టేజీతో ఇస్తున్నారు. దీనివల్ల ఇప్పటికే మా పొలంలో రెండుసార్లు మోటర్ కాలిపోయింది.
– శ్రీనివాసరెడ్డి, రైతు, కొత్తూరు, సత్తుపల్లి, ఖమ్మం
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంటు కోతలే లేవు. సాగుతోపాటు గృహ వినియోగానికి ఇచ్చే కరెంటు సైతం కోత లు లేకుండా ఇచ్చా రు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విపరీతమైన కరెంటు కోతలు ఉన్నాయి. ఒకవైపు దోమల గోల, మరోవైపు కరెంటు కోతలతో రైతులు, వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయాల్లో ఎప్పుడు కరెంటు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియడంలేదు. ఉక్కబోతతో వృద్ధులు, పిల్లలు నిద్రపోయే పరిస్థితి లేదు.
– పగుట్ల వెంకటేశ్వరరావు, రైతు, వెంకటాపురం, వేంసూరు, ఖమ్మం జిల్లా
కరెంటు కోతలు లేవని అధికారులు చెబుతున్నారు. కానీ నాలుగు గంటలకోసారి కరెంటు పోతున్నది. చిన్నగాలి వీచినా కరెంటు తీసేస్తున్నారు. కరెంటు ఆఫీసుకు ఫోన్లు చేస్తే ఎత్తడం లేదు. ఆదివారం వస్తే చాలు చెట్ల కొమ్మల కటింగ్ పేరుతో గంటలకొద్దీ కరెంటు తీసేస్తున్నారు. రాత్రివేళ కరెంటు పోతే గంటలకొద్దీ వేచిచూడాల్సిందే.
– ఏమునూని భవానీప్రసాద్, జీఆర్బస్తీ, కొత్తగూడెం, భద్రాద్రి జిల్లా