Etela Rajender | హుజూరాబాద్ టౌన్, ఏప్రిల్ 16 : హుజూరాబాద్ మండలంలోని చెల్పూర్లో మహిళను వేధించిన గ్రామ సర్పంచ్‌కు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వత్తాసు పలకడం దుర్మార్గమని హుజూరాబాద్ ఎంపీపీ ఇరుమల్ల రాణి సురేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని మండలి విప్ కౌశిక్‌రెడ్డి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీజేపీ కార్యకర్తను కాపాడుకొనేందుకు ప్రజలను ఎమ్మెల్యే తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. చెల్పూరుకు చెందిన ముస్లిం మహిళ సుల్తానా అదే గ్రామంలో రోడ్డు పకన డబ్బా వేసుకొని చికెన్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నదని, ఆమెపై కక్షతో సర్పంచ్ మహేందర్ డబ్బా ఎలాగైనా తొలగించాలని మూడేండ్లుగా వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. తనకు జీవనోపాధి కల్పిస్తున్న డబ్బా కొనసాగించుకొనేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె కలెక్టర్‌కు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకొన్నదని, అయినా సర్పంచ్ మానసికంగా వేధించడంతో భరించలేకనే ఆమె ఈ నెల 12న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిందని తెలిపారు.
ఈ విషయంపై బాధిత మహిళ కొడుకు ఎండీ షాబొద్దీన్ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, దీంతో పట్టణ సీఐ రమేశ్ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి మహిళను వేధించిన సర్పంచ్, వార్డు సభ్యుడిపై కేసు నమోదు చేశారని చెప్పారు. చట్టపరంగా నిందితులను అరెస్ట్ చేసిన సీఐపై ఈటల రాజేందర్ విమర్శలు చేయడం సబబు కాదని హితవుపలికారు. సీఐ చేసిన నేరమేంటి? అని ఈటలను ప్రశ్నించారు. మహిళను వేధించిన సర్పంచ్, వార్డు సభ్యుడిపై కేసు నమోదు చేయడం నేరమా? అని అడిగారు. అసలు విషయాన్ని పకనపెట్టి ఈటల ఇతర విషయాలు మాట్లాడడం, సంబంధంలేని వాటిని అంటగట్టి ప్రజలను తప్పుదారి పట్టించడం సరికాదని హితవుపలికారు. అన్యాయం, అక్రమాలు చేస్తున్న వారికి తొత్తుగా మారారని ధ్వజమెత్తారు. మహిళలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న ఈటల రాజేందర్ నియోజకవర్గంలోని గ్రామాల్లో తిరిగితే అడ్డుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పావని, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ నిర్మల తదితరులు పాల్గొన్నారు.