బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 28, 2020 , 23:13:30

నెహ్రూ తర్వాత పీవీయే..

నెహ్రూ తర్వాత పీవీయే..

  • దేశాన్ని కొత్త మలుపు  తిప్పిన మహానేత

బ్రిటన్‌లోని భారత సంతతి రాజకీయవేత్తల్లో ఆ దేశ ఎంపీ వీరేంద్ర శర్మకు ప్రత్యేక స్థానముంది. అట్టడుగు స్థాయి నుంచి ఎదిగి ప్రజాభిమానం పొందిన నేత. పంజాబ్‌ నుంచి వలస వెళ్లి బ్రిటన్‌లోని ఈలింగ్‌లో స్థిరపడ్డారు. కొన్నేండ్లు ఉద్యోగ జీవితం గడిపిన తర్వాత పూర్తిస్థాయి రాజకీయాల్లోకి దిగారు. ఒక్కో మెట్టూ ఎదుగుతూ పోయారు. తొలుత ఈలింగ్‌ మేయర్‌గా, ఆ తర్వాత ఈలింగ్‌ నియోజకవర్గం ఎంపీగా ఎన్నికయ్యారు. భారత్‌-బ్రిటన్‌ సంబంధాల అభివృద్ధికి కృషిచేస్తున్న శర్మ.. కమిటీల్లో కూడా స్థానం పొందారు. బ్రిటన్‌లో స్థిరపడినా పుట్టినగడ్డతో సంబంధాలు మాత్రం వదులుకోలేదు. తరచుగా ఇండియాకు వచ్చిపోతుంటారు. సొంత రాష్ట్రమైన పంజాబ్‌కు ఎక్కువగా వస్తుంటారు. చివరిసారి ఇండియాకు వచ్చినప్పుడు మాత్రం ఆయన ప్రత్యేకించి హైదరాబాద్‌ను సందర్శించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అంటే తనకున్న అశేషమైన అభిమానంతో పీవీ ఘాట్‌కు వెళ్లి దివంగత నేతకు నివాళి అర్పించారు. పీవీ శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో ఆయనతో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ..

ఇటీవల కరోనాతో అస్వస్థులయ్యారని తెలిసింది. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది?

చాలా బాగుంది. ధన్యవాదాలు.

పీవీ అంటే మీకు ప్రత్యేక అభిమానమని అంటారు. నిజమేనా?

నిజమే. గత నాలుగున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో పరిణామాలు నా కండ్లముందు జరిగాయి. రాజకీయ విద్యార్థిగా ఎన్నో తెలుసుకున్నాను. భారత్‌కు అత్యున్నత స్థాయిలో సేవచేసినవాళ్లను, భారత్‌-బ్రిటిష్‌ సంబంధాల అభివృద్ధికి పాటుపడినవాళ్లెందరినో చూశాను. కానీ పీవీ నరసింహారావు గారి భావాలు నాకు నచ్చాయి. ఎందుకంటే అవి నా భావాలకు దగ్గరగా ఉంటాయి. అందుకే ఆయనంటే నాకు ఎంతో గౌరవం. భారతదేశాన్ని గొప్ప మలుపు తిప్పిన మహానేత ఆయన.

మరి మీరు ఇంతగా అభిమానించే పీవీని ఎప్పుడైనా కలిశారా? మాట్లాడారా?

ఈలింగ్‌ మేయరుగా ఉన్నప్పుడు నేను ఒకసారి పంజాబ్‌లో సందర్శించాను. అప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. పీవీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పంజాబ్‌ వచ్చారు. ఆ సందర్భంలోనే నాకు ఆయన్ను కలుసుకునే మహాభాగ్యం కలిగింది. సుమారు 20 నిమిషాల సేపు నేను ఆయనతో మాట్లాడాను. ఆయన అపార మేధా సంపన్నత నన్ను ఆకట్టుకుంది. పీవీ ఆలోచనలు, దార్శనికత నాకు ఎంతగానో నచ్చాయి. ఆ సమావేశం నన్ను ఆయన భావాలకు చేరువ చేసింది. భారత రాజకీయాల్లో ఆయన నిర్వహించిన పాత్ర, ఆయన అమలులోకి తెచ్చిన కొత్త ఆలోచనలు నన్ను ప్రభావితం చేశాయి. ఆయన వీరాభిమానుల్లో నేనూ ఒకడినని సగర్వంగా చెప్పగలను. 


మీరు చాలామంది ప్రధానులను చూశారు. వారితో సన్నిహితంగా మెలిగారు. మొత్తం అందరు  ప్రధానుల్లో మీరు పీవీని ఎక్కడ నిలబెడతారు?

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కొంచెం కష్టమే. ఎందుకంటే ఒకరిని మరొకరితో పోల్చి చెప్పాలంటే కుదరదు. ఎవరి ఘనత వారిది. ఒక్కో ప్రధాని తన భావాలకు అనుగుణంగా దేశానికి మార్గనిర్దేశం చేశారు. పీవీకి ముందు కొందరు ఎక్కువకాలం పరిపాలించారు. కొందరు తక్కువ కాలం పరిపాలించారు. మొత్తం మీద చూస్తే నెహ్రూ తర్వాత దేశంలో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టింది, దేశానికి సరికొత్త దిశానిర్దేశం చేసింది పీవీయేనని చెప్పవచ్చు.

పీవీ శతజయంతి వేడుకల సందర్భంగా మీరు ఏదైనా కార్యక్రమంలో పాలుపంచుకొంటున్నారా?

అవును. లండన్‌లో నిర్వహిస్తున్న శతజయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్నాను. ఉపన్యాసాలు ఇస్తున్నాను. ఆయనపై ఉన్న అభిమానాన్ని పలువురితో పంచుకునే అవకాశం దక్కింది. అంతగొప్ప నాయకుడి గురించి ఎంత చెప్పినా తక్కువే కదా!


logo