హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అస్థిరత్వానికి, అవినీతికి, విధానలోపాలకు ఓటేసినట్టేనని ఆదివారం ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నారు.
కాంగ్రెస్ హయాంలో రాజస్థాన్‌లో ఐదేండ్లుగా అసమర్థ పాలన నడిచిందని, కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అభివృద్ధి పూర్తిగా స్తంభించిందని, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఢిల్లీ అధిష్ఠానానికి డబ్బు సమకూర్చడంలో మునిగిపోయిందని, మధ్యప్రదేశ్‌ను వెనుకబడిన రాష్ట్రంగానే ఉంచిందని తెలిపారు. కాంగ్రెస్ అంటేనే కుంభకోణాలు, అధికార దుర్వినియోగం అనే విషయాలు దేశమంతటికీ తెలుసని పేర్కొన్నారు. అందుకే ఆ పార్టీ ప్రజల మద్దతు పూర్తిగా కోల్పోయిందని, మరోసారి అధికారంలోకి రావడం కలేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు ఓటేయడమంటే ఓటును వృథా చేసుకోవడమేనని ప్రజలకు హితవు పలికారు.