హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తేతెలంగాణ): బీసీ రిజర్వేషన్ల పెంపునకు చట్టబద్ధత కల్పించేదాకా బీఆర్ఎస్ పోరాటం ఆపబోదని రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర స్పష్టంచేశారు. చెల్లని జీవో, ఆర్డినెన్స్‌లతో కాంగ్రెస్ మభ్యపెడితే, పార్లమెంట్లో చట్ట సవరణ చేయకుండా బీజేపీ మోసం చేస్తున్నదని నిప్పులు చెరిగారు.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో శనివారం బీసీ బంద్‌కు మద్దతుగా బీఆర్ఎస్ చేపట్టిన ధర్నానుద్దేశించి ఆయన మాట్లాడారు. హంతకులే సంతాపం తెలిపిన చందంగా బీసీల బంద్‌కు కాంగ్రెస్, బీజేపీ మద్దతివ్వడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను నెరవెర్చేదాకా కాంగ్రెస్ నేతలు పొర్లు దండాలు పెట్టినా బలహీనవర్గాలు నమ్మే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు.
పార్లమెంట్లో ఓట్చోరీ గురించి గళమెత్తిన కాంగ్రెస్ ఎంపీలు.. బీసీ రిజర్వేషన్ల పెంపు గురించి ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆ రెండు జాతీయ పార్టీలు డ్రామాలు ఆపి బీసీ రిజర్వేషన్ల సాధనకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ప్రధాని మోదీని ఒప్పించి బీసీ రిజర్వేషన్లను సాధించాలని హితవు పలికారు. ధర్నాలో మాజీ మంత్రులు తలసాని, శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ బడుగుల, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, కోరుకంటి చందర్ తదితరులు పాల్గొన్నారు.