హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో ట్రాఫిక్ ని యంత్రణకు మెట్రో, ఎంఎంటీఎస్ ఫేజ్-2 ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కేంద్రానికి విజ్ఞప్తిచేశారు. రాజ్యసభలో శుక్రవారం జీరో అవర్‌లో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ హయాంలో శాంతి భద్రతలు మెరుగ్గా ఉండటం, మంత్రి కేటీఆర్ కృషితో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెద్ద ఎత్తున సమకూరాయని పేర్కొన్నారు. మెట్రో-2, ఎంఎంటీఎస్-2 ప్రాజెక్టులు పూర్తయితేనే ఎయిర్పోర్ట్, ఐటీ కారిడార్, హైదరాబాద్ బయట ప్రాంతాలు కనెక్ట్ అవుతాయని తెలిపారు.
వద్దిరాజు ప్రసంగాన్ని కాంగ్రెస్ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా వెనక్కితగ్గకుండా ప్రసంగాన్ని కొనసాగించారు. గతేడాదితో పోల్చితే పెట్టుబడులు తగ్గాయని, యువ ఇంజినీర్లు, గ్రాడ్యుయేట్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు.
మెట్రో, ఎంఎంటీఎస్ ఫేజ్-2కు అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి ఆశ్వీని వైష్ణవ్‌కు ఎంపీ వినతిపత్రం అందజేశారు. ఖమ్మంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తిచేయాలని విజ్ఞప్తిచేశారు.