అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటి గ్రీన్ చాలెంజ్‌లో పాల్గొనండి
స్త్రీమూర్తులకు రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ పిలుపు
హైదరాబాద్, మార్చి 6 : మొక్కలు నాటడం అంటే.. తల్లి ప్రేమను పొందడం వంటిదేనని గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమ వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ పేర్కొన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళ ఒక పండ్ల మొక్కను నాటి 9000365000 సెల్ నంబర్‌కు సెల్పీ ఫొటోను పంపించాలని ఆదివారం విజ్ఞప్తిచేశారు. జీవితమంతా నిస్వార్థంగా ఫలాలను అందించే మొక్కలాగే.. ప్రతి మహిళా త్యాగాలతో కుటుంబాలను నిలబెడుతుందని, అచంచలమైన ప్రేమను కురిపిస్తుందని, ఈ స్ఫూర్తికి ప్రతిరూపంగా ప్రతి స్త్రీమూర్తి మొక్కను నాటి ఔనత్యాన్ని చాటాలని కోరారు. మొక్కలపెంపకాన్ని మనమంతా బాధ్యతగా స్వీకరించినప్పుడే పుడమి పచ్చగా ఉంటుందని తెలిపారు. అంతర్జాతీయ మహిళాదినోత్సవం రోజున మహిళలంతా మొక్కలను నాటి గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పంచుకోవాలని సంతోష్‌కుమార్ పిలుపునిచ్చారు.