హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తేతెలంగాణ): కేసీఆర్ ఎమ్మెల్యే కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడులు చేసి ప్రజాస్వామ్యానికే తలవంపులు తెచ్చారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాధ్యతతో వ్యవహరించాల్సిన అధికార పార్టీ నేతలు చిల్లర చేష్టలతో తెలంగాణ పరువు తీశారని దుయ్యబట్టారు. పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి దుందుడుకు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. హస్తం పార్టీ మూకలు పట్టపగలు దాడులు చేస్తుంటే అడ్డుకోవాల్సిన పోలీస్ యంత్రాంగం చేష్టలుడిగి చూడటం శోచనీయమని ఆయన పేర్కొన్నారు. దాడికి కారకులైన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డిని డిమాండ్ చేశారు. అధికార పార్టీ దౌర్జన్యకాండను గులాబీ పార్టీ దీటుగా ఎదుర్కొంటుందని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధిచెప్పి తీరుతామని వద్దిరాజు రవిచంద్ర హెచ్చరించారు.