రవీంద్రభారతి, నవంబర్ 24: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు మొండి చెయ్యి చూపిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 46ను ఉపసంహరించుకుంటున్నట్టు మంత్రివర్గ సమావేశంలో ప్రకటించాలని 100 బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే రాష్ర్టాన్ని దిగ్బంధిస్తామని హెచ్చరించాయి. సోమవారం హైదరాబాద్ బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో జాక్ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అధ్యక్షతన 100 బీసీ సంఘాల ఉద్యమ కార్యాచరణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వం బీసీలను వంచించి గొంతు కోసిందని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42 శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటి వరకు అఖిలపక్షాన్ని ప్రధానమంత్రి వద్దకు ఎందుకు తీసుకెళ్లడం లేదని ప్రశ్నించారు.
రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ డెడికేషన్ కమిషన్ నివేదికను ఎందుకు గోప్యంగా ఉంచారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు పాలూరు రామకృష్ణయ్య ప్రసంగిస్తూ ప్రభుత్వం అన్ని దశల్లో తప్పులు చేస్తూ అటు కోర్టులు, ఇటు చట్టసభలు, బీసీలను మోసం చేస్తున్నదని విమర్శించారు. దర్శకుడు ఎన్ శంకర్ మాట్లాడుతూ 42 శాతం రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రకటించి ఇప్పుడేమో ఇవ్వలేమనడం విడ్డూరంగా ఉందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలు, కుట్రలను బీసీలు గమనించాలని సూచించారు. సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్, జాతీయ బీసీ సంక్షేమ కో ఆర్డినేటర్ డాక్టర్ అరుణ్‌కుమార్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గుజ్జ సత్యం, జాతీయ యాదవ హక్కుల సంఘం నేత రాములుయాదవ్, డాక్టర్ శంకర్ ముదిరాజ్, కొండ దేవయ్య, మున్నూరుకాపు సంఘం నేత జయంత్‌రావు, పూసల సంఘం నేత కోల శ్రీనివాస్, బోయ సంఘం నేత గోపి, వీరేందర్‌గౌడ్, జిల్లపల్లి అంజి, గొరిగే మల్లేశ్, సీహెచ్ మల్లేశ్, వంశీరాజు, అశోక్ ఆరె కటిక, అనంతయ్య, బర్క కృష్ణ, నరేందర్ నేత, రఘు పెరిక, మహిళానేతలు అన్నపూర్ణ గౌడ్, పద్మ, అంజలియాదవ్, దివ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.