రవీంద్రభారతి, మే 21: రాష్ట్రంలో వడ్లు, మక్కజొన్న పంటల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం తగదని, వెంటనే ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తిచేశారు. కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలులో ఏర్పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తిచేశారు. అమ్మకాల్లో రైతుల ఇబ్బందుల దృష్ట్యా ముఖ్యమంత్రికి ఆర్ కృష్ణయ్య గురువారం లేఖ రాశారు. ఈసారి రాష్ట్రంలో వరి పంట అంచనాలకు మించి భారీగా పండిందని, ధాన్యం సేకరణలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. నెలల తరబడి వడ్లను చేలలో కుప్పలు పోసుకొని రైతులు రాత్రింబవళ్లు కాపాడుకుంటున్నారని తెలిపారు. చాలాచోట్ల రెండు నెలలుగా ధాన్యం కల్లాల్లోనే ఉండటంతో గాలి, వానతో ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ధాన్యం సేకరణలో అధికారులు వేగం పెంచాలని, గన్నీ సంచుల కొరతను నివారించాలని డిమాండ్ చేశారు.