రవీంద్రభారతి, నవంబర్ 18: బీసీలకు ఇచ్చిన హామీ ముఖ్యమా? కేంద్రం ఇచ్చే రూ.మూడు వేల కోట్లు ముఖ్యమా? అనేది ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తేల్చుకోవాలని, లేకుంటే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని బీసీ సంఘాల జాక్ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు నెలలు ఓపిక పట్టాలని, కోర్టు తీర్పు వెలువడే వరకు ఆగాలని కోరారు. హైకోర్టులో కేసు గెలిచే అవకాశం ఉన్నదనే ఆశాభావం వ్యక్తంచేశారు. మంగళవారం ఆయన బషీర్బాగ్ దేశోద్దారక భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కోర్టులు ఇచ్చిన తీర్పులను సాకుగా చూపి 22% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్తే అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేవరకు ఎన్నికలు నిర్వహించవద్దని లేకుంటే యుద్ధం తప్పదని హెచ్చరించారు. పార్టీలపరంగా రిజర్వేషన్లు ఇస్తామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేదిలేదని స్పష్టంచేశారు. సీలింగ్ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి తన మనసు మార్చుకోవాలని కోరారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీపరంగా రిజర్వేషన్లు కల్పించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 21న అన్ని జిల్లా కలెక్టరేట్లు, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట దీక్షలు, రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. పార్టీపరంగా మాకు సీట్లు వద్దు.. మేమైనా బిచ్చగాళ్లమా? అని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి బాణాల అజయ్, బీసీ నేతలు నీల వెంకటేశ్ పాల్గొన్నారు.