హన్మకొండ : కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి వరంగల్(Warangal) లోక్‌సభ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్(Pasunuri Dayakar) అన్నారు. బుధవారం హరిత కాకతీయలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వరంగల్‌కు స్మార్ట్ సిటీ, హృదయ్ పథకం, అమృత్ స్కీం, రూర్బన్ పథకాలను తెచ్చాను. బీజేపీ ఎంపీ బండి సంజయ్ కంటే నేనే ఎక్కువ నిధులు తెచ్చానని పేర్కొన్నారు.
విభజన హామీల అమలుకోసం అనేక సార్లు కేంద్రానికి వినతిపత్రం ఇచ్చానని గుర్తు చేశారు. తెలంగాణలో సంక్షేమ పథకాలు తెచ్చిన ఘనత కేసీఆర్‌దేనని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. పని చేసిన వాళ్లను కేసీఆర్ గుర్తిస్తారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తానని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు ఉన్నారని ఇన్నిరోజులు బయటకు రాలేదు.
దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన టాప్ 10లో నేను ఒకడినని గుర్తు చేశారు. మా ఎమ్మెల్యేలు లేని లోటు ఎంపీగా గెలిచి చూపిస్తానని చెప్పారు. ఇప్పటి వరకు రూ.3 వేల కోట్లతో పనులు చేసినా ఏ రోజు కాంట్రాక్టర్ల వద్ద కమిషన్లు తీసుకోలేదని తెలిపారు. టికెట్ ఎవరికి ఇచ్చినా కార్యకర్తగా పని చేస్తానని స్పష్టం చేశారు.