న్యూఢిల్లీ: పార్లమెంటు సాక్షిగా ఏర్పడిన తెలంగాణను ప్రధాని మోదీ అవమానిస్తున్నారని ఎంపీ నామా నాగేశ్వర రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. చరిత్రను తెలుసుకోకుండా ప్రధాని మాట్లాడారని విమర్శించారు. ఎంపీలు కేకే, కవిత, రంజిత్ రెడ్డి, వెంకటేశ్ నేతకానితో కలిసి ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఉద్యమనాయకుడిగా కేసీఆర్ 17 ఏండ్లపాటు పోరాడి తెలంగాణ సాధించారని చెప్పారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగానికీ సిద్ధపడ్డారన్నారు. తెలంగాణ ప్రజల పోరాటాన్ని మోదీ అవమానించారు చెప్పారు.
రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు అవుతుందని, ఈ ఎనిమిదేండ్లలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏమైనా చేసిందా అని ప్రశ్నించారు. ఆ పార్టీ నేతలు తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.
అన్ని పార్టీలు మద్దుతు ఇచ్చిన బిల్లు అశాస్త్రీయం ఎలా అవుతుందని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు ప్రశ్నించారు. బిల్లు ఆమోదంలో అశాస్త్రీయం ఏముందో బీజేపీ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వమే చాలా బిల్లులను చర్చించకుండానే ఆమోదిస్తున్నదని విమర్శించారు. ప్రధాని మోదీ అసందర్భంగా తెలంగాణ ఏర్పాటును ప్రస్తావించారని, రాష్ట్ర ప్రజలను అవమానించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్లమెంటు సాక్షిగా ఏర్పాటైన రాష్ట్రంపై మోదీ వ్యాఖ్యలు సరికావన్నారు.