కొల్లాపూర్: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటనలో నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు మల్లు రవి ( MP Mallu Ravi ) మంత్రి జూపల్లి అనుచరులపై విరుచుకుపడ్డారు. శనివారం కొల్లాపూర్ నియోజక వర్గంలో పలు అభివృద్ధి పనులకు భట్టి విక్రమార్క రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు( Minister Jupalli) తో కలిసి శంకుస్థాపనలు చేశారు.
అనంతరం జరిగిన బహిరంగ సభలో పార్లమెంటు సభ్యులు మల్లు రవి దాదాపు అరగంటసేపు మాట్లాడారు. ఆయన స్పీచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి తో పాటు , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కుడు ( Mallu Batti Vikramarka ) చేసిన అభివృద్ధి పనులను వివరించాడు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేస్తున్నా మహిళల తరఫున భట్టి విక్రమార్క ఆర్టీసీ సంస్థకు రూ. 6, 600 కోట్లను చెల్లించారని, 200 యూనిట్లు వాడుతున్న ప్రజల తరఫున కరెంటు బిల్లులను సైతం చెల్లిస్తున్నాడని పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో 50 లైబ్రరీల నిర్మాణం కోసం కోటి రూపాయలు శాంక్షన్ చేయడంతో పాటు మరికొన్నింటికి నిధులు మంజూరు చేశారని వివరించారు.
ఈ దశలో మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరుడు పెద్దకొత్తపల్లి కాంగ్రెస్ మండల నాయకుడు దండు నరసింహ స్లిప్పుపై స్పీచ్ ముగించాలని మల్లు రవికి ఇవ్వడంతో ఆ నాయకుడిపై కోపోద్రేకుడైయ్యారు. తాను జూపల్లి కృష్ణారావు పెట్టిన చాపల కూర, చికెన్ కర్రీ తిని పోవడానికి రాలేదని స్థానిక నాయకులపై అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి బ్యాచ్‌ను తన వద్దకు పంపవద్దని జూపల్లి కృష్ణారావుకు సూచించారు.
సదరు మంత్రి జూపల్లి కృష్ణారావు మల్లురవికి సర్ది చెప్పేందుకు ప్రయత్నించగా తన ప్రసంగాన్ని అడ్డుకోవడం తప్పు , తప్పున్నర అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో వేదికపై ఉన్న ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, బహిరంగ సభకు హాజరైన ప్రజలు అవాకయ్యారు.