Mallu Ravi | కొల్లాపూర్, ఆగస్టు 2 : సభలో ప్రసంగం ముగించాలని కోరినందుకు నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవికి కోపమొచ్చింది. ‘ప్రసంగం ముగించాలని నాకే చెప్తావా?’ అంటూ ఓ కాంగ్రెస్ నాయకుడిపై రుసరుసలాడారు. చేపల కూర, చికెన్ తినేందుకు రాలేదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం కొల్లాపూర్ నియోజకవర్గంలో మంత్రి జూపల్లితో కలిసి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించారు. ఈ సందర్భంగా కొల్లాపూర్ పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ఎంపీ దాదాపు అరగంటకుపైగా ప్రసంగించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి గురించి వివరించారు.
ఈ సమయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరుడు, పెద్దకొత్తపల్లి కాంగ్రెస్ నాయకుడు దండు నరసింహ.. స్పీచ్ ముగించాలని ఎంపీ మల్లు రవికి చీటీ అందించారు. దీంతో కోపోద్రిక్తుడైన మల్లు రవి మాట్లాడుతూ.. మంత్రి జూపల్లి పెట్టిన చేపల కూర, చికెన్ కర్రీ తినిపోయేందుకు కొల్లాపూర్‌కు రాలేదని అసహనం వ్యక్తంచేశారు. ‘నేను సొల్లు మాటలు మాట్లాడలేదు… నన్నే ప్రసంగం ఆపమంటారా?’ అని అరిచారు. ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఓ కార్యక్రమంలో తాను పాల్గొనాల్సి ఉన్నా.. ఇక్కడికి వచ్చినట్టు తెలిపారు. ప్రజల అభివృద్ధి కోసం తాను మాట్లాడుతుంటే తననే ప్రసంగం ఆపమంటరా? అని మండిపడ్డారు. ఇలాంటి బ్యాచ్‌ను తన వద్దకు పంపొద్దని జూపల్లికి సూచించారు. మల్లు రవికి మంత్రి జూపల్లి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో డిప్యూటీ సీఎం భట్టితోపాటు పలువురు అవాక్కయ్యారు.