హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): రైల్వేల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నదని, రైల్వేలైన్లతోపాటు కొత్త ప్రాజెక్టుల మంజూరులో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నదని టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం లోక్‌సభలో వివిధ పద్దులపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగిస్తూ.. దేశీయ రైల్వేల మొత్తం రాబడిలో దక్షిణ మధ్య రైల్వేకి 60 శాతం వాటా ఉన్నప్పటికీ తెలంగాణ పట్ల కేంద్రం వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. కాజీపేటలో కోచ్‌ఫ్యాక్టరీని, కాజీపేట రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైల్వేలైన్ల కేటాయింపులో తెలంగాణకు న్యాయం చేయాలని స్వయంగా సీఎం కేసీఆర్ విన్నవించినా పట్టించుకోవ టం లేదని నిప్పులు చెరిగారు. కాజీపేట-హుజురాబాద్- కరీంనగర్, ఆర్మూర్- నిర్మల్- ఆదిలాబాద్, మణుగూరు- భూపాలపల్లి- రామ గుండం, జడ్చర్ల-నంద్యాల, మంచిర్యాల-ఆదిలా బాద్ వయా ఉట్నూర్, హైదరాబాద్- సూర్యాపేట-విజయవాడ, పెద్దపల్లి-కాజీపేట, గద్వాల-మాచర్ల, బోధన్-బీదర్, జహీరాబాద్- సికింద్రాబాద్ రైల్వేలై న్ల విషయంలో నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. మెట్రోపాలిటన్ సిటీగా ఎదిగిన హైదరాబాద్‌కు బుల్లెట్ రైలును కేటాయించడంలేదని మండిప డ్డారు. చర్లపల్లిస్టేషన్ను శాటిలైట్ టర్మినల్‌గా, సికింద్రాబా ద్‌లోని రైల్వే డిగ్రీ కాలేజీని యూని వర్సిటీగా ఉన్నతీకరించాలని, సికింద్రాబాద్ లో రైల్వే స్పోర్ట్స్ స్టేడియంను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో 34 ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, త్వరలో జరిగే రిక్రూట్మెంట్ ద్వారా వాటిని భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మంగళవారం లోక్‌సభలో టీఆర్ఎస్ సభ్యులు వెంకటేశ్ నేతకాని, గడ్డం రంజిత్‌రెడ్డి, పసునూరి దయాకర్, మాలోతు కవిత అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్రాయ్ లిఖితపూర్వకంగా ఈ విషయాన్ని తెలియజేశారు.
పటాన్చెరు-సంగారెడ్డి-జోగిపేట-మెదక్ రైల్వేలైన్ ప్రాజెక్టును కేంద్రం మూడేండ్ల నుంచి మూలన పడేసిందని ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ధ్వజమె త్తారు. పారిశ్రామికరంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నందున వెంటనే ఈ పనులను చేపట్టాలని డిమాండ్‌చేశారు. మెదక్ జిల్లా రామ చంద్రాపురం మండలం తెల్లాపూర్‌లో ఆర్యూబీని నిర్మించాలని కోరారు. మనోహరాబాద్, చేగుంట, అక్కన్నపేట తదితర ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న రైల్వే పనులను వెంటనే చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
దేశవ్యాప్తంగా కంటోన్మెంట్ల తాజా పరిస్థితిపై సమీక్షించాలని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి లోక్‌సభలో కేంద్రాన్ని డిమాండ్ చేశారు. స్వాంతంత్య్రానంతరం సికింద్రాబాద్ సహా దేశంలోని అనేక కంటోన్మెంట్ల భూములను రక్షణశాఖకు లీజుకిచ్చారని, వాటిలో చాలా భూములు అన్యాక్రాంతమయ్యాయని పేర్కొన్నారు. ఆయా భూముల్లో నివసిస్తున్నవారికి కంటోన్మెంట్ బోర్డుల ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తుండటంతో ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని కోల్పోతున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్ల తాజా పరిస్థితిపై రక్షణశాఖ వెంటనే సమీక్షించాలని, లీజుకు తీసుకున్న భూములను ఆయా రాష్ర్టాలకు అప్పగించాలని కోరారు.