హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 28: చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో(Thousand Pillar Temple) వినాయక చవితి వేడుకలు బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకలను స్థానిక శాసనసభ్యులు నాయిని రాజేందర్‌రెడ్డితో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య హాజరై గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. ఆలయానికి చేరుకున్న ఎంపీ కావ్యకి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డికి ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో పూర్ణకుంభస్వాగతం పలికి ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయ ప్రాంగణం మొత్తం ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో మార్మోగింది.
ప్రజల ప్రగతికి, లక్ష్యాలకు ఎలాంటి విఘ్నాలు కలుగకుండా ఆ గణపతి అనుగ్రహించాలని కోరుకున్నట్లు ఎంపీ కడియం కావ్య తెలిపారు. చారిత్రక వేయిస్తంభాల ఆలయాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, త్వరలోనే కేంద్ర మంత్రిని కలిసి నిధుల మంజూరుకు విజ్ఞప్తి చేస్తానని చెప్పారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతో వరంగల్ ఆలయాలు, పర్యాటక ప్రదేశాలు, రహదారులు, విద్యా, వైద్య రంగాభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ తెలిపారు. అనంతరం నిర్వహించిన గణపతి పల్లకి సేవలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పాల్గొని స్వయంగా పల్లకి మోసారు. అనంతరం ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు వేద ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేసి వారిని ఘనంగా సన్మానించారు.