హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ అధినేత, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయాన్ని కూడా సొంతంగా అమలు చేయలేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. శనివారం ఓ తెలుగు న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ క్యాబినెట్ ఆమోదం లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టు క్యాబినెట్ ఆమోదం లేకుండా సాధ్యమా? అని ప్రశ్నించారు. క్యాబినెట్ అనుమతి లేకుండా ఏ జీవోలు కూడా విడుదలకావని చెప్పారు. ఆనాటి విషయాలను తుమ్మల నాగేశ్వరరావు మర్చిపోయారేమోనని, అవసరమనుకుంటే డాక్యుమెంట్స్ పంపుతానని ఈటల చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు క్యాబినెట్ ఆమోదం లేదని చెప్పడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. కాళేశ్వరంపై మంత్రివర్గ ఉపసంఘం వేసింది నిజమా? కాదా? అని ప్రశ్నించారు. దమ్ముంటే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును ప్రభుత్వం బయటపెట్టాలని సవాల్ చేశారు.