MP Etela Rajender | హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): హైడ్రా పేరుతో సీఎం రేవంత్రెడ్డి చేస్తున్న హైడ్రామా ఆపాలని, కట్టినవాటిని కాకుండా చిత్తశుద్ధి ఉంటే అక్రమ నిర్మాణాలు జరగకుండా చూడాలని ఎంపీ ఈటల రాజేందర్ సూచించారు. ‘అక్రమ కట్టడాలపై కఠినంగా ఉన్నా అని చెప్పుకొంటున్న నువ్వు.. ఏం చేస్తున్నావో మా దగ్గర చిట్టా ఉన్నది. పిల్లి కండ్లు మూసుకొని పాలు తాగినట్టు చేస్తున్నవు. డ్రామాలు ఆపితే మంచిది’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ పూర్తిగా జరిగిందన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలన్నీ బోగస్ అని మండిపడ్డారు.
బ్యాంకర్ల లెకల ప్రకారం 72 లక్షల మందికి రుణమాఫీ చేయాల్సి ఉన్నదని, ఎన్నికల ముందు 64 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని రేవంత్రెడ్డి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. విధివిధానాల పేరుతో 49 లక్షల మందికి కుదించారని, తీరా 22 లక్షల మంది రైతులకు కేవలం రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేసి అందరికీ చేశామని గొప్పలు చెప్పుకొంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక ఘట్కేసర్ సొసైటీలోనే 1200 మంది రైతులకు రూ.9 కోట్ల రుణాల్లో రూపాయి కూడా మాఫీ కాలేదని చెప్పారు. దమ్ముంటే పూర్తిగా రుణమాఫీ కాలేదని ఒప్పుకోవాలని సవాల్ చేశారు. ప్రభుత్వ లోపాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ రేవంత్రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు.