కమలాపూర్, ఆగస్టు 27: హైడ్రా పేరిట సీఎం రేవంత్‌రెడ్డి డ్రామా ఆడుతున్నాడని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. మంగళవారం ఆయన హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో మీడియాతో మాట్లాడారు. ఎన్నడూ ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా సక్కగా పదవి చేపట్టని రేవంత్‌రెడ్డి మాయమాటలు చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడని ఆరోపించారు. ‘అబద్ధాలాడే వాళ్లనే ప్రజలు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటరు. ప్రభుత్వం వస్తది, నిజం చెప్పేవాళ్లని ఎన్నుకోరు’ అని రేవంత్‌రెడ్డి అమెరికాలో చెప్పాడని, ఇప్పుడే అదే నిజమైందని అన్నారు. ఎన్నికల ముందు 65 లక్షల మంది రైతులు ఉన్నారని, రూ.48 వేల కోట్లతో రుణమాఫీ చేస్తామని చెప్పి, ఇప్పుడు 45 లక్షల మంది రైతులే ఉన్నారని, 34వేల కోట్లు సరిపోతుందని చెప్పి, చివరకు రూ. 17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశాడని దుయ్యబట్టారు.