హైదరాబాద్ : లగచర్ల ఘటనపై ఎన్హెచ్ఆర్సీకి(NHRC ) ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajender) ఫిర్యాదు చేశారు. రైతులను పోలీసు కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురిచేశారని..ఇప్పటికీ పోలీసులు, అధికార పార్టీ నాయకులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని జాతీయ మానవ హక్కుల కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఎన్హెచ్ఆర్సీ బృందాలను లగచర్లకు పంపించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేసారు. కమిషన్ కూడా సానుకూలంగా స్పందించిందని ఈటల రాజేందర్ తెలిపారు.
కాగా, మహిళా సంఘాల జేఏసీ(Women JAC leaders) నేతలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం వికారాబాద్ జిల్లాలోని లగచర్లకు(Lagacharla) వెళ్తుండగా మంగళవారం బొమ్రాస్ పేట మండలం తుంకిమెట్ల గ్రామం వద్ద మహిళా సంఘాల జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పెనుగులాటలో మహిళా నేతల దుస్తులను పోలీసులు చించివేశారు. మహిళా సంఘాల జేఏసీ నేతలు సంధ్య, పద్మజా షా, ఝాన్సీ, అనసూయ, సజయ, సిస్టర్ లిస్సి, గీత సహా పలువురిపై దాష్టీకానికి పాల్పడ్డారు.