హైదరాబాద్, నవంబర్ 27(నమస్తే తెలంగాణ) : ఆర్డినెన్స్, బిల్లు అంటూ బీసీలను ఆశలపల్లకి ఎక్కించిన కాంగ్రెస్ ప్రభుత్వం 42శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచిందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రిజర్వేషన్లతో కాంగ్రెస్ ద్వంద్వవైఖరి బయటపడిందని, బీసీలకు ఆ పార్టీ భస్మాసుర హస్తంగా మారిందని మండిపడ్డారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఊదరగొట్టి, 17శాతానికే పరిమితం చేసిందని ధ్వజమెత్తారు.
బీసీలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ డీఎన్ఏలోనే లేదని ఎద్దేవా చేశారు. 2019లో 2,404 గ్రామాల్లో బీసీ రిజర్వేషన్లు కల్పిస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 2,176 గ్రామాల్లోనే రిజర్వేషన్లు మాత్రమే కల్పించిందని పేర్కొన్నారు. కులగణనతో కాంగ్రెస్ కర్ణాటక, తెలంగాణలో చేసిందేమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.