కంఠేశ్వర్, అక్టోబర్ 15: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 చోట్ల గెలిచిన బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో ఒక్క సీటుకు మాత్రమే ఎందుకు పరిమితమైందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. నాయకత్వలోపంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నిజామాబాద్ కలెక్టరేట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీలో సమన్వయలోపం ఉందని కుండబద్ధలు కొట్టిన ఆయన.. సొంత పార్టీపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రజలు బీజేపీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నా.. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రాకపోవడానికి కారకులు ఎవరని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అందరూ అనుకున్నా..8 స్థానాలకే ఎందుకు పరిమితమైందో ఆలోచించుకోవాలన్నారు. రాష్ట్ర పార్టీలో సమన్వయ లోపం ఉందని స్పష్టంగా చెప్పిన ఎంపీ అర్వింద్.. ఇప్పటికైనా పార్టీ అధికారంలోకి వచ్చేలా ఆలోచించాలని బీజేపీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.
కార్పొరేటర్‌గా గెలువని వ్యక్తి..
ఆర్వోబీల విషయంలో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ చేసిన వ్యాఖ్యలను ఎంపీ అర్వింద్ ఖండించారు. రైల్వే వంతెనలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించక పోవడం వల్లే పనులు ముందుకు సాగడంలేదని చెప్పారు. ముందు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరు చేయించాలని హితవు పలికారు. ప్రత్యక్ష ఎన్నికలలో ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలను పక్కన పెడితే కనీసం కార్పొరేటర్‌గా కూడా గెలవని మహేశ్‌కుమార్‌గౌడ్ తన పేరు తీసుకోకపోవడమే మంచిదని ఎద్దేవా చేశారు.