హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర దయాగుణాన్ని, దాతృత్వాన్ని మరోమారు చాటుకున్నారు. బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లి అక్కడే మృతవాత పడిన నల్లగొండ జిల్లా వాసి మృతదేహాన్ని సొంత ఖర్చులతో స్వస్థలానికి రప్పించారు. జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన శ్రీరాములు బతుకుదెరువు కోసం సౌదీ అరేబియా వెళ్లారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన రియాద్‌లోని దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శ్రీరాములు మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని స్వస్థలానికి తెప్పించడం ఎలాగో, ఎవరిని కలవాలో, ఎంత ఖర్చవుతుందో తెలియక తీవ్ర మానసిక క్షోభ అనుభవించారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతల సహకారంతో ఎంపీ వద్దిరాజు రవిచంద్రను కలిశారు. ఆయన సానుకూలంగా స్పందించారు. మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. మృతదేహాన్ని ఇండియాకు రప్పించేందుకు సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపారు. మృతదేహం హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు ఏర్పాటుచేశారు. సుమారు రూ.3 లక్షలు ఖర్చు కాగా, ఎంపీ సొంతంగా భరించారు. ఎంపీ రవిచంద్ర చొరవతో మృతదేహం విమానంలో హైదరాబాద్ విమానాశ్రయం, అక్కడి నుంచి బుధవారం రాత్రి స్వస్థలమైన వెలిమినేడుకు చేరుకున్నది. శ్రీరాములు చివరి చూపు తమకు దక్కేలా చేసిన ఎంపీకి శ్రీరాములు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు కృతజ్ఞతలు తెలిపారు.