ఖమ్మం రూరల్/మల్లాపూర్, అక్టోబర్ 31: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ దళిత ద్రోహి అని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అవహేళన చేస్తూ మాట్లాడటం హేయమని.. వెంటనే ఎస్సీ, ఎస్టీలకు బహిరంగ క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని రెడ్డిగూడెంలో ఆదివారం వంగపల్లి మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపీగా ఎన్నికై చట్టాలను అగౌరపరిచే విధంగా అర్వింద్ మాట్లాడటం బాధాకరమని అన్నారు. దళిత జాతికి క్షమాపణ చెప్పి ఎంపీ పదవికి రాజీనామా చేయకుంటే అర్వింద్ ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో దళితులు, ముస్లింలు, క్రైస్తవులు, అంబేడర్ వాదులపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తంచేశారు.
అంబేద్కర్ సంఘం నాయకుల అందోళన
నిజామాబాద్ ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలపై జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్వింద్ తీరును నిరసిస్తూ అంబేద్కర్ యువజన సంఘం మండలాధ్యక్షుడు ఎర్ర రమేశ్ ఆధ్వర్యంలో ఆదివారం భరతమాత కూడలి వద్ద ఆందోళన నిర్వహించారు. ఎంపీ అర్వింద్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.