హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఫీజు పోరు రాజుకున్నది. నిరవధిక నిరసనలకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వంపై ముప్పేట దాడికి సంఘాలు సిద్ధమయ్యాయి. రెండేండ్లుగా విసిగి వేసారిన ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఒకవైపు, అవస్థలతో నెట్టుకొస్తున్న విద్యార్థి లోకం మరోవైపు ఉద్యమ కార్యాచరణను ప్రకటించాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలనే ప్రధాన డిమాండ్‌తో విద్యార్థి సంఘాలన్నీ పోరుబాటలోకి వచ్చాయి. నవంబర్ 3 నుంచి కాలేజీ యాజమాన్యాలు నిరవధిక బంద్‌కు పిలుపునివ్వగా, తాజాగా వివిధ విద్యార్థి సంఘాలు తమ నిరసన రూపాలను ప్రకటించాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం రెండేండ్లలో స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయలేదు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేలకోట్ల మేరకు ఆయా బకాయిలు ఇవ్వాల్సి ఉన్నది. టోకెన్లు జారీ అయిన రూ.1,207 కోట్లను దీపావళి పండుగ లోపు విడుదల చేస్తామని సర్కారు హామీనిచ్చింది. దానిలో భాగంగా కేవలం రూ.300 కోట్లును మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. సర్కారు తొలి నుంచి బకాయిల విడుదల విషయంలో మొండిగా వ్యవహరిస్తుండటంతో వివిధ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందడంలేదు. మరోవైపు కాలేజీలను నడపలేకపోతున్నామని యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో తామున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కళాశాలల నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చామని చెప్తున్నాయి. రెండేండ్లుగా విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తాము ఉద్యమానికి సిద్ధమయ్యామని వివిధ విద్యార్థి సంఘాలు ప్రకటించాయి.
స్కాలర్షిప్లు, ఫీజు రీయిబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) బుధవారం జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది. బుధవారం 33 జిల్లా కలెక్టరేట్లను ముట్టడిస్తామని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ప్రకటించారు. బకాయిలు పేరుకుపోవడంతో కాలే జీ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదని, తల్లిదండ్రులు ఆస్తులను తాకట్టు పెట్టి ఫీజులను చెల్లించాల్సి వస్తున్నదని తెలిపారు. సర్కారు నిర్లక్ష్యంతో నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఉద్యోగ, ఎంట్రె న్స్ పరీక్షలు రాయలేని పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. కాంట్రాక్టర్లకు గ్రీన్‌చానల్ ద్వారా బకాయిలను చెల్లిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. విద్యార్థుల గోడును అసలే పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముట్టడి కార్యక్రమాలను చేపట్టింది. మంగళవారం హైదరాబాద్ నారాయణగూడ చౌరస్తాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. రానున్న రోజుల్లో మండల, నగర, జిల్లా కేంద్రాల్లో ఆందోళనలను ఉధృతం చేయనున్నట్టు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు తెలిపారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విషయంలో సర్కారు తీరును నిరసిస్తూ ఈ నెల 30న కాలేజీలు, విద్యాసంస్థల బంద్‌కు ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు డీవైఎఫ్ఐ కూడా మద్దతు పలికింది. దశలవారీగా బకాయిలను విడుదల చేస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీల మేరకు విడుదల చేయకపోవడం గర్హనీయమని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రిగా సీఎం ఉండి, పేద విద్యార్థుల ఇబ్బందులను పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
‘ఫీజు’ బకాయిల విడుదల విషయంలో కాంగ్రెస్ సర్కారు వైఫల్యాన్ని నిరసిస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఏఐఎస్ఎఫ్ ప్రకటించింది. ఫీజు బకాయిలను చెల్లించకపోతే విద్యార్థులెలా చదువుకుంటారని ప్రశ్నించింది. ఫీజు రీయింబర్స్మెంట్, బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యారంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తక్షణమే విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సర్కారు ఫీజు బకాయిలను చెల్లించకుండా కాలయాపన చేయడంతో విద్యార్థులు మానసిక వేదనకు గురవుతున్నారని, ధ్రువపత్రాలు కాలేజీ యాజమాన్యాల వద్దే ఉండటంతో ఉన్నత చదువులకు వెళ్లడానికి, ఉద్యోగాలు చేయడానికి ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. పెండింగ్ ఫీజు బకాయిలను విడుదల చేయాలని ఈ నెల 30న విద్యార్థి సంఘాలు నిర్వహించే రాష్ట్రబంద్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌చేశారు.