హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్స్‌కు మరింత రక్షణ కల్పించేలా తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్, బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేసే యుగంతర్ అనే స్వచ్ఛంద సంస్థ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా ట్రాన్స్జెండర్ల ప్రొటెక్షన్ సెల్ ప్రైడ్ పోలీస్ కింద అందించే సేవలు మరింత మెరుగుపడనున్నాయి.
ఈ ఒప్పంద ప్రకారం తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ పోలీసులు, యుగంతర్ సభ్యులు ట్రాన్స్జెండర్లకు సేవలు అందించనున్నారు. వారు ఏదైనా సంక్షోభంలో ఉన్నప్పుడు జోక్యం చేసుకోవడం, చట్టపరమైన సహకారం అందించడం, మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించడం, అందుకోసం పోలీసులకు శిక్షణ ఇవ్వడం, ప్రజల్లో అవగాహన కల్పించడం లాంటి సేవలు ఇందులో ఉన్నాయి.
యుగంతర్ స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్‌లోని తన క్వీర్ ట్రాన్స్ వెల్నెస్ అండ్ సపోర్టు సెంటర్ ద్వారా ట్రాన్స్జెండర్ల సహాయార్థం నైపుణ్యంగల సభ్యుల సంఖ్యను, మౌలిక సదుపాయాలను మెరుపర్చనుంది. ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలను తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ అదనపు డీజీపీ చారుసిన్హా ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.