ఆదిలాబాద్ జిల్లాలో భూగర్భజలాలు అండగంటిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తాంసి మండలం కప్పర్లకు చెందిన రైతు పోగుల అశోక్ 1.5 ఎకరాల్లో జొన్న సాగు చేశాడు. భూగర్భ జలాలు ఇంకిపోవడంతో రెండు బోరుబావుల్లో నీళ్లు రావడం లేదు. పంటలను కాపాడుకుందామని బోర్లు వేస్తే కాలిపోతున్నాయి. ఒకసారి మోటర్ కాలిపోతే రూ.5 వేలు ఖర్చు అవుతున్నాయని రైతు అశోక్ ఆవేదన వ్యక్తం చేశాడు. నీళ్లు లేక జొన్నతోపాటు కూరగాయల పంటలు నష్టపోవాల్సి వస్తున్నదని తెలిపాడు.
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంతోపాటు విస్సంపల్లి, జయ్యారం, ఉగ్గంపల్లి, మన్నెగూడెం తదితర గ్రామాల్లో సాగు నీరులేక పొలాలు ఎండిపోతున్నాయి. గతంలో నీటితో కళకళలాడిన ఆకేరు వాగు నేడు వెలవెలబోతున్నది. ఉగ్గంపల్లికి చెందిన రైతు దారమల్ల వెంకన్న యాసంగిలో రెండెకరాల్లో వరి సాగు చేశాడు. పంటను కాపాడుకునేందుకు వాగులో చెలిమ తీసి నీరందిస్తున్నాడు. మరికొందరు రైతులు ఇదేవిధంగా నీటినందిస్తున్నారు.
తెలంగాణలో రెండో పెద్దనది కృష్ణమ్మ నీళ్లులేక వెలవెలబోతున్నది. వేసవి ప్రారంభానికి ముందే రాళ్లు తేలి జీవం కోల్పోయింది. నెల కిందటి వరకు జలకళను సంతరించుకున్న నది ఒక్కసారిగా వట్టిబోయింది. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం కొల్పూరు శివారులో కళావిహీనంగా దర్శనమిస్తున్నది. దీంతో నదీ జలాలపై ఆధారపడిన ఎత్తిపోతల పథకాలకు నీరు అందడం లేదు. ఫలితంగా పంటలు ఎండుముఖం పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.