Motkupalli Narasimhulu | హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): ఎంపీ టికెట్ల కేటాయింపు విషయంలో మాదిగలకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందంటూ మాజీమంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు గురువారం నిరసనదీక్ష చేపట్టారు. బేగంపేట లీలానగర్‌లోని తన నివాసంలో చేపట్టిన నర్సింహులు దీక్షకు పలువురు మాదిగ నేతలు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో మాదిగలకు బీఆర్ఎస్, బీజేపీ చెరో రెండేసి సీట్లు కేటాయించాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ గతంలో మాలమాదిగలకు చెరో సీటు కేటాయించిందని, ఈసారి మాత్రం మాదిగలకు ఒక్కసీటు కూడా కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
సీఎం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడంలేదు
ముఖ్యమంత్రి రేవంత్‌ను కలిసి మాదిగలకు జరిగిన అన్యాయంపై వివరిద్దామంటే తనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ సీఎం అవుతారని చెప్పిన తొలి వ్యక్తిని తానేనని పేర్కొన్నారు. అలాంటి తనకే అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో తాను ఎంతోమంది సీఎంలను చూశానని కానీ, రేవంత్ హయాంలో మాదిగలకు జరిగినంతటి అన్యాయం గతంలో ఎప్పుడూ జరగలేదని పేర్కొన్నారు. తమ జాతికి జరుగుతున్న అన్యాయంపై మందకృష్ణ మాదిగ సరిగానే స్పందించారని తెలిపారు. మాదిగలకు రెండు సీట్లు కేటాయించే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు నష్టం చేయాలని తాను అనుకోవడం లేదని, మాదిగలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. పార్టీలో ఉండే పోరాడతానని, పార్టీ మారే ప్రసక్తే లేదని మోత్కుపల్లి తేల్చిచెప్పారు. మోత్కుపల్లి దీక్షకు పార్టీ సీనియర్ నేతలు సర్వే సత్యనారాయణ, వీ హనుమంతరావు సంఘీభావం ప్రకటించారు. సాయంత్రం ఆయన నివాసానికి చేరుకుని నిమ్మరసం అందించి మోత్కుపల్లితో దీక్షను విరమింపజేశారు.