Jeedimetla | జీడిమెట్ల, ఏప్రిల్ 17 : కడుపున పుట్టిన పిల్లలను కన్నతల్లే కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఎంతకష్టమొచ్చినా నవమాసాలు మోసిన పిల్లల ఆలనాపాలనా చూసుకుంటుంది. కానీ తనకు ఉన్న ఓ అరుదైన కంటి వ్యాధి పిల్లలకు కూడా రావడంతో, ఆ బాధను భరిస్తూ జీవనం సాగిస్తున్నది. పిల్లలు, తన అనారోగ్యం పట్ల అందరూ హేళన చేశారు. ఆఖరికి కట్టుకున్న భర్త కూడా విసుక్కుంటూ ‘చస్తే చావండి’ అని అనడంతో మనస్తాపం చెందిన భార్య.. పిల్లలను చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ శివారు జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని గాజులరామారంలో జరిగింది.. ఈ హృదయవిదారకమైన ఘటన.
గాజులరామారంలో జరిగిన విషాదఘటనపై జీడిమెట్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి సమీపంలోని చోడవరం గ్రామానికి చెందిన గాండ్ర వెంకటేశ్వరరెడ్డి భార్య తేజస్విని (35), వీరికి ఇద్దరు కుమారులు అశీశ్రెడ్డి (7), హర్షీత్‌రెడ్డి (5)తో కలిసి బాలాజీ లేఅవుట్లోని సహస్ర మహేశ్ హెయిట్స్ అపార్టుమెంట్‌లోని 204 ప్లాట్‌లో నివాసముంటున్నారు. ఇద్దరు పిల్లలకు అరుదైన కంటి వ్యాధి ఉంది. వీరికి రెండు గంటలకు ఒకసారి కంట్లో చుక్కల మందు వేయకుంటే నొప్పి తట్టుకోలేరు. గురువారం వెంకటేశ్వరరెడ్డి డ్యూటీకి వెళ్లగా ఇంట్లో తేజస్విని, ఇద్దరు పిల్లలున్నారు. గురువారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో తేజస్విని అపార్టుమెంట్‌పై నుంచి దూకగా అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికులు తేజస్విని ప్లాటుకు వెళ్లిచూడగా వంటగదిలో ఇద్దరు కుమారులు రక్తపుమడుగులో పడి ఉన్నారు.
తేజస్విని ప్లాటులో పోలీసులు 8 పేజీల ఓ లేఖ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలకు కంటి సమస్య ఉంది. రెండు గంటలకు ఒకసారి కంట్లో మందు వేయకుంటే పిల్లలు నొప్పితో ఏడుస్తారు. దేవుడా నా పిల్లలకు ఎందుకు ఇంత బాధను ఇచ్చావు? నన్ను అందరూ పిచ్చిది అంటున్నారు. కంటి నొప్పి సమస్యలతో బాధపడుతున్న నా పిల్లలను నేనే చంపుకున్నాను. ఇంతటి పరిస్థితి ఏ తల్లికీ రావద్దు. నా పిల్లలు లేని బతుకు నాకు ఎందుకు? నేను కూడా చనిపోతున్నాను. అమ్మా, నాన్నా ఐ యామ్ సారీ. ఆస్తిలో ఒక్క పైసా కూడా నా భర్తకు ఇవ్వవద్దు. ఆస్తి మొత్తం అనాథలు, స్కూల్ పిల్లలకు ఇవ్వండి అంటూ తేజస్విని లేఖలో పేర్కొంది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.