Mother Dairy | యాదాద్రి భువనగిరి, జనవరి 12 (నమస్తే తెలంగాణ): మదర్ డెయిరీకి గడ్డు కాలం దాపురించిందా? కాంగ్రెస్ హయాంలో నార్ముల్ను ఖతం చేసే కుట్రలు చేస్తున్నారా? పాడి రైతులకు వరమైన యూనియన్ను కాలగర్భంలో కలిపేందుకు పన్నాగాలు జరుగుతు న్నాయా? అంటే.. అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఫిబ్రవరి 7న సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి, మదర్ డెయిరీ భూముల విక్రయాన్ని ఎజెండాగా పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండ-రంగారెడ్డి జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ లిమిటెడ్ (మదర్ డెయిరీ) మూడున్నర దశాబ్దాల కాలంగా పాడి ఉత్పత్తిదారులకు ఆసరాగా నిలుస్తున్నది. ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పరిధిలో 24 చిల్లింగ్ సెంటర్లు, 32 వేల మంది సభ్యులు, 432 సొసైటీల ద్వారా రోజుకు లక్ష లీటర్ల పాల సేకరణ జరుగుతున్నది. 3లక్షల మంది వినియోగదారులకు పాలు, పాల ఆధారిత ఉత్పత్తులను అందిస్తున్నది.
రూ.60కోట్ల అప్పులు అంటూ..
మదర్ డెయిరీ 26వ సర్వసభ్య ప్రత్యేక స మావేశం ఏర్పాటుకు ఈ నెల 9న సభ్యులకు నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 2న హయత్నగర్లో సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. ‘నార్మాక్ యూనియన్ రూ.60కోట్ల వరకు ఆర్థిక భారం ఏర్పడి రోజువారీ కార్యక్రమాలు నిర్వహించేందుకు యూనియన్ స్థిరాస్తులు విక్రయించడానికి చర్చించి నిర్ణయం తీసుకుకోవడానికి..’ అని ఎజెండాలో స్పష్టం చేశారు.
ఉమ్మడి నల్లగొండలో 30.5 ఎకరాల అమ్మకం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యూనియన్ పేరు మీద కొనుగోలు చేసిన భూములను అమ్మాలని స్కెచ్ వేశారు. నల్లగొండ జిల్లాలోని చిట్యాల పరిధిలో 29 ఎకరాలు, మిర్యాలగూడ పరిధిలోని 1.5 ఎకరాల భూమిని విక్రయించాలని ఎజెండాలో పేర్కొన్నారు.
గతంలో ఒప్పుకోని బీఆర్ఎస్ సర్కారు
పాడి రైతులకు వరంగా ఉన్న డెయిరీ ఆస్తులను అమ్మేందుకు నాడు కేసీఆర్ ప్రభుత్వం ససేమిరా అంది. గతేడాది సెప్టెంబర్లో మదర్ డెయిరీ ఎన్నికల సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు క్యాంపులకు విజయ డెయిరీ మాదిరిగానే మదర్ డెయిరీకి గ్రాంట్లు ఇప్పించి, అప్పులు తీర్చేలా ఆదుకుంటామని ప్రకటించారని సభ్యులు చెబుతున్నారు. లీటరుకు రూ.4 బోనస్ ఇస్తామని చెప్పి పాల రేట్లను తగ్గిస్తూ వచ్చారని వాపోతున్నారు.
ఆస్తులు విక్రయిస్తే ఉద్యమమే..
మదర్ డెయిరీ ఆస్తులు అమ్మడానికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందా? ఎన్నికల సమయంలో మంత్రి కోమటిరెడ్డి, విప్ బీర్ల ఐలయ్య చెప్పిన గ్రాంట్లు ఏమయ్యాయి..? లీటరుపై నాలుగు రూపాయల బోనస్ ఇవ్వకపోగా రేట్లు తగ్గించడం దారుణం. ఆస్తుల విక్రయం నిర్ణయాన్ని విరమించుకోవాలి. పట్టించుకోకుండా ముందుకు వెళ్తే పెద్దఎత్తున ఉద్యమం చేస్తాం.
– దొంతిరి సోమిరెడ్డి, మదర్ డెయిరీ మాజీ డైరెక్టర్