హాలియా, మే 17 : ఆస్తి తగాదా ఇద్దరిని బలిగొన్నది. ఈ దారుణ ఘటన నల్లగొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపేట శివారులో చోటుచేసుకున్నది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపేటకు చెందిన రుద్రాక్షి సుమలత, యాదయ్య దంపతులు. వీరికి లావణ్య కుమార్తె ఉన్నది. చిన్నతనంలోనే తండ్రి యాదయ్య చనిపోయాడు. లావణ్య పేరుమీద 6 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా నానమ్మ వెంకటమ్మ గార్డియన్‌గా ఉంటూ పట్టాచేయించుకున్నది. ఇటీవల లావణ్య మేజర్ కావడంతో ఆ భూమి ఆమెకు చెందుతుంది. ఆ భూమిపై కన్నేసిన ఆమె సమీప బంధువులు లావణ్య, ఆమె తల్లి సుమలతను హత్య చేస్తే ఆస్తి తమకే వస్తుందని పథకం వేశారు.
అందులో భాగంగానే ఆదివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో వారి బంధువులు తల్లీకూతురు సుమలత (40), లావణ్య(20)ను ఆయిల్‌పామ్ తోటకు రప్పించారు. అక్కడ వారి కండ్లల్లో కారం చల్లి, చున్నీ మెడకు చుట్టి ఊపిరి ఆడకుండా గట్టిగా బిగించి హత్య చేశారు. మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు, హాలియా ఎస్సై సాయిప్రశాంత్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యలకు కారణమైన పదిమందిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.