నల్లగొండ: నల్లగొండ (Nalgonda) పట్టణంలో విషాదం చోటుచేసుకున్నది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పట్టణంలోని పద్మా నగర్లో ఓ ఇంటి గోడకూలి తల్లీకూతుళ్లు మృతిచెందారు. పద్మానగర్‌కు చెందిన నడికుడి లక్ష్మి, ఆమె కూతురు కళ్యాణి గురువారం రాత్రి తమ ఇంట్లో నిద్రిస్తున్నారు. అయితే వర్షాలకు శుక్రవారం తెల్లవారుజామున ఇంటిగోడ కూలిపోయింది. నిద్రిస్తున్న వారిపై బిరువపడింది. దీంతో తల్లీకూతుళ్లు నిద్రలోనే అనంతలోకాలకు చేరుకున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కాగా, కళ్యాణికి ఇటీవలే వివాహమయిందని స్థానికులు తెలిపారు. లక్ష్మి కుటుంబం కొన్నేండ్ల క్రితం శ్రీకాకుళం నల్లగొండకు వలసవచ్చిందని, రైల్వే కూలీలకు వంట చేస్తూ జీవనం సాగిస్తున్నారని వెల్లడించారు.