Runa Mafi | కరీంనగర్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రుణమాఫీ కథ మళ్లీ మొదటికి వచ్చింది. అర్హులైన రైతులందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు రుణమాఫీ కాని రైతుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ పేరిట మరో అంకానికి తెరలేపుతున్నది. మూడు విడతల్లోనూ రుణమాఫీ జరగని రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నదని నిఘా వర్గాలు హెచ్చరించడంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. ఫిర్యాదులు, సూచనల పేరిట తాజాగా కొత్త మార్గదర్శకాలు (సర్క్యులర్-24) జారీచేసింది. వీటిలోనూ స్పష్టత కొరవడింది. రైతులు ఎప్పటిలోగా ఫిర్యాదు చేయాలి? వాటిని అధికారులు ఎప్పటిలోగా పరిష్కరించాలి? ఇప్పటివరకు స్వీకరించిన ఫిర్యాదులను ఏమి చేస్తారు? అనే అంశాలపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో మార్గదర్శకాల పేరిట మరోసారి దాటవేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్న విమర్శలొస్తున్నాయి.
మళ్లీ కొత్త కథ
నిజానికి రూ.2 లక్షల వరకు పంట రుణాలను అందరికీ ఒకేసారి మాఫీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఆ తరువాత వాటిని మూడు దఫాలుగా మాఫీ చేస్తామంటూ మాటమార్చారు. మొదటి విడత రుణమాఫీ జూలై 18న, రెండో విడత జూలై 30న, మూడో విడత ఆగస్టు 15న చేపట్టారు. మొదటి విడతలోనే రాష్ట్రంలో లక్షలాది రైతుల పేర్లు గల్లంతయ్యాయి. దీంతో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయితే మొదటి జాబితాలో మాఫీ కాని వారికి రెండో విడతలో అవుతుందని, అప్పటివరకు ఓపిక పట్టాలంటూ అధికారులు సర్దిచెప్పడంతో రైతులు కాస్త మెత్తబడ్డారు. రెండో విడతలో కూడా తమ పేర్లు కనిపించకపోవడంతో ఫిర్యాదు చేసే రైతుల సంఖ్య పెరిగింది. దీంతో మూడో విడత వరకు ఓపిక పట్టాలని అధికారులు సూచించడంతో రైతులందరూ ఇప్పటివరకు ఎదురు చూశారు. మొదటి రెండు విడతల్లో రుణమాఫీ జరగలేదని స్పష్టంగా రైతులకు తెలిసినా.. చాలామంది ఆ విషయాన్ని మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కాని పంచుకోవడానికి ముందుకు రాలేదు. ఈరోజు కాకపోతే రేపైనా మాఫీ అవుతుందన్న కోణంలో ఆలోచించి కోపాన్ని దిగమింగుకున్నారు. మూడో విడతలోనూ తమ పేర్లు లేకపోవడంతో రైతుల్లో ఆగ్రహం పెల్లుబికుతున్నది. ఇన్నాళ్లు వేచిచూసిన రైతులు ఇక ఓపిక పట్టే పరిస్థితుల్లో లేరన్న విషయాన్ని నిఘా వర్గాలు ప్రభుత్వానికి చేరవేశాయి.
మసిపూసేందుకు మరో డ్రామా..?
రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎక్కువ శాతం మందికి రుణమాఫీ జరగలేదన్న వార్తలే వస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో 40-45% మందికి, మరికొన్ని గ్రామాల్లో 50% వరకు రుణమాఫీ అయింది. దీంతో ఇన్నాళ్లు ఆశగా వేచిచూసిన రైతులు ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా పది మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం.. అందులోనూ అనేక కొర్రీలు పెట్టింది. ఉదాహరణకు అంశం నంబర్ 7ను పరిశీలిస్తే.. అసలు, వడ్డీ మొత్తం లో సరిపోలని పక్షంలో, రైతు నుంచి దరఖాస్తు తీసుకుని, వివరాలను క్లుప్తంగా పేరొంటూ పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించింది. ఆయా దరఖాస్తులను నిర్ధారణ, దిద్దుబాటు కోసం అదే బ్యాంకుకు పంపుతామని పేర్కొన్నది. ప్రభుత్వ చిత్తశుద్ధిని ఈ ఒక్క అంశంతో తేల్చవచ్చంటున్నారు నిపుణులు. లోన్ ఎంత ఉన్నదో రైతు చెప్పగలడు కానీ, వడ్డీ ఎంత ఉన్నదన్న విషయాన్ని రైతు ఎలా చెప్పగలడు? అలాగే రైతు నుంచి తీసుకున్న దరఖాస్తును తిరిగి సంబంధిత బ్యాంకుకు పంపిస్తామని పేర్కొన్నది. రైతు నుంచి దరఖాస్తును తీసుకునే బదులు.. నేరుగా బ్యాంకు నుంచి వివరాలు తెప్పించుకోవచ్చు. అయితే సాగదీసే వ్యూహంతోనే మళ్లీ దరఖాస్తుల అంకానికి తెర లేపుతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ప్రభుత్వం మున్ముందు ఇంకా మరికొంందరికి రుణమాఫీ చేస్తదన్న నమ్మకాన్ని రైతుల్లో కల్పించేందుకే ఈ మార్గదర్శకాలు జారీ చేశారనే చర్చ జరుగుతున్నది.
ఎందుకీ ఈ తతంగం?
రుణమాఫీ ప్రక్రియను గతంలో రెండుసార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించింది. ఏనాడూ ఇటువంటి ఫిర్యాదులు రాలేదు. ముందుగానే అర్హులను గుర్తించి, అమలు చేసింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అర్హుల జాబితాలో కోతలు పెట్టడమే లక్ష్యంగా వ్యవహరించింది. అసలు రుణమాఫీ అర్హుల జాబితాలను ఎక్కడి నుంచి తీసుకున్నారన్న విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఇప్పుడు కూడా రుణమాఫీ కాని రైతులను అధికారుల చుట్టూ తిప్పుకుండా గ్రామస్థాయిలో రుణమాఫీ కానివారితో ఒక మీటింగ్ పెట్టి… కారణాలు తెలుసుకొని అక్కడికక్కడే వివరాలను అప్లోడ్ చేస్తే సరిపోతుందన్న సూచనలు వస్తున్నాయి. ఆయా బ్యాంకులు, సహకార సంఘాలు రుణమాఫీ కాని రైతుల జాబితాలను తయారు చేసి పెట్టాయి. వాటి నుంచి నేరుగా డాటా తీసుకొని.. ప్రభుత్వం సదరు రైతులకు నేరుగా సమాచారం ఇచ్చి అవసరమైన పత్రాలను తెప్పించి, రుణమాఫీ చేయొచ్చు. కానీ, ఇటువంటి మార్గాలను ప్రభుత్వం అనుసరించకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
రుణమాఫీ ఎప్పుడు చేస్తరు? బ్యాంకు ఎదుట రైతుల నిరసన
తమకు రుణమాఫీ కాలేదంటూ శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎదుట రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చినా.. ఇప్పటివరకు సగం మందికి కూడా కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతులందరికీ రుణమాఫీ చేయాలని కోరారు. వీరికి స్థానిక బీఆర్ఎస్ నాయకుడు భరత్ చౌహాన్, ఉట్నూర్ మాజీ సర్పంచ్ బొంత ఆశారెడ్డి మద్దతు తెలిపారు.
ఇవి తాజా మార్గదర్శకాలు