Gadwal | గద్వాల జిల్లా ప్రభుత్వాస్పత్రిలో దయనీయ పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. మార్చురీలో ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో మృతదేహాన్ని ఆరుబయటే వదిలేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ ఘటన వైరల్ కావడంతో ప్రభుత్వ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.
గద్వాల జిల్లా కేంద్రంలోని పిల్లిగుండ్ల కాలనీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని రాత్రి 8.40 గంటలకు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రి మార్చురీలో ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో మృతదేహాన్ని లోపల ఉంచేందుకు సిబ్బంది నిరాకరించారు. అధికారుల అనుమతి ఉంటేనే మార్చురీలోకి మృతదేహాన్ని తీసుకెళ్తామని చెప్పారు. దీంతో చేసేదేమీ లేక దాదాపు రెండు గంటల పాటు వేచి చూసిన పోలీసులు.. ఆ తర్వాత మృతదేహాన్ని మార్చురీ బయటే వదిలేసి వెళ్లారు.
ఆస్పత్రి బయట మృతదేహం ఉన్న ఘటన వైరల్ కావడంతో స్థానికులు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కనీసం మృతదేహాలను భద్రపరిచే ఫ్రీజర్లు కూడా పనిచేయకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ ఝాన్సీ లక్ష్మీ స్పందించారు. గత కొద్దిరోజులగా ఫ్రీజర్లు పనిచేయడం లేదని, బయట మార్కెట్ నుంచి ఫ్రీజర్లను తెప్పించి మృతదేహాలను భద్రపరుస్తున్నామని వెల్లడించారు.
గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో దయనీయ పరిస్థితులు
మార్చురీలో ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో, మృతదేహాలను ఆరుబయటే వదిలేసిన అధికారులు
గద్వాల జిల్లా కేంద్రంలోని పిల్లిగుండ్ల కాలనీలో గుర్తుతెలియని వ్యక్తి(48) మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
దీంతో రాత్రి 8:40 గంటలకు… pic.twitter.com/8Lmt4vXWZb
— Telugu Scribe (@TeluguScribe) May 19, 2026