హైదరాబాద్, నవంబర్ 4(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వెయ్యి మందికిపైగా విద్యార్థులున్న సర్కారు బడులు ఎన్ని అంటే భూతద్దంపెట్టి వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. కేవలం 15 సర్కారు బడుల్లోనే వెయ్యి మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. గతంలో వెయ్యి మందికి పైగా విద్యార్థులున్న బడుల్లో ఎన్రోల్మెంట్ తగ్గిపోయింది. హైదరాబాద్ కిషన్‌బాగ్‌లోని దరిచేబవాహీర్, రామచంద్రాపురం (సంగారెడ్డి), వనపర్తి బాలుర, వనపర్తి బాలికలు, ధారూరు(జోగుళాంబ), కొండమల్లేపల్లి (నాగర్‌కర్నూల్), కుల్సుంపుర(హైదరాబాద్), ఇచ్చోడ(ఆదిలాబా ద్), ఫిలింనగర్(హైదరాబాద్) వంటి సర్కారు బడుల్లో గతంలో వెయ్యి మందికిపైగా విద్యార్థులుండేవారు. కానీ ఇప్పుడు సంఖ్య తగ్గిపోయింది. రాష్ట్రంలో 7,876 బడుల్లో విద్యార్థుల సంఖ్య 30లోపే ఉంది. 31 నుంచి 100 మందిలోపు విద్యార్థులున్న బడులు 9,763 ఉన్నాయి. 101 నుంచి 250 మంది విద్యార్థులున్నవి 3,773 ఉన్నాయి. 251 నుంచి వెయ్యి మందిలోపు విద్యార్థులున్న బడులు కేవలం 1,106 మాత్రమే.
మణికొండ టాప్
సర్కారు బడుల్లో పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ మణికొండ(రంగారెడ్డి) 1,372 మంది విద్యార్థులతో అగ్రస్థానంలో ఉంది. ప్రభు త్వ బాలుర ఉన్నత పాఠశాల – చింతలపేట(గద్వాల) 1,310 మందితో రెండోస్థానం, నాట్కో స్కూల్ బోరబండ 1,235 మందితో మూడో స్థానం, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నాంపల్లి 1,226 మందితో నాలుగో స్థానంలో ఉంది. జడ్పీహెచ్ఎస్ శేరిలింగంపల్లి 1,157, జడ్పీహెచ్ఎస్ జిల్లెలగూడ 1,124, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల సంకులమ్మమెట్టు 1, 119, జడ్పీహెచ్ఎస్ జగద్గిరినగర్ 1,106, జడ్పీహెచ్ఎస్ కూకట్పల్లి 1,076, ప్రభుత్వ ప్రాక్టిసింగ్ హైస్కూల్ భీంనగర్ 1,069, జడ్పీహెచ్ఎస్ హయత్‌నగర్ 1,046, పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ ఇంద్రవెల్లి 1,036, జడ్పీహెచ్ఎస్ శివరాంపల్లి 1,026, జడ్పీహెచ్ఎస్ బోరేగాం 1,002, జడ్పీహెచ్ఎస్ బాదేపల్లి 1,001 మంది విద్యార్థులతో టాప్-15లో ఉన్నాయి.
55 బడుల్లో ఒకే ఒక్క విద్యార్థి
రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ ప్రాథమిక బడుల్లో ఒక్కదాంట్లోనూ 500 మంది విద్యార్థులు లేరు. మొత్తం 26,141 బడులుంటే 18,295 ప్రాథమిక బడులే ఉన్నాయి. ఈ 18వేల పైచిలుకు బడుల్లో ఒక్కదాంట్లోనూ 500 మంది విద్యార్థులు లేకపోవడం గమనార్హం. 55బడుల్లో ఒకే ఒక్క విద్యార్థి ఉన్నారు. ఇద్దరు విద్యార్థులతో నడుస్తున్న బడులు 151 ఉండగా, ముగ్గురితో నడుస్తున్నవి 193 ఉన్నాయి.