Kalyana Lakshmi | హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): కల్యాణలక్ష్మి/షాదీముబారక్ పథకాల కింద తులం బంగారం ఇస్తామన్న హామీని అమలు చేయకపోగా, రూ.1,00,016 ఆర్థిక సాయాన్ని అందజేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తున్నది. చెక్కులు జారీ చేసినా లబ్ధిదారులకు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నచోట ఈ సమస్య తీవ్రంగా ఉన్నది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం ఇచ్చిన లిఖితపూర్వక సమాధానమే ఈ విషయాన్ని స్పష్టంచేస్తున్నది. చెక్కులు మంజూరైనా దాదాపు 14,865 మందికి ఇవ్వకుండా పెండింగ్ పెట్టడం గమనార్హం. సర్టిఫికెట్ వెరిఫికేషన్ దశలో మరో 86,483 దరఖాస్తులు పెండింగ్ ఉన్నట్టు ప్రభుత్వమే వెల్లడించింది. క్షేత్రస్థాయిలో 41,887 దరఖాస్తులు, ఆర్డీవోల స్థాయిలో 24,724, ఎమ్మెల్యేల స్థాయిలో 19,872 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి.
కల్యాణలక్ష్మి/షాదీముబారక్ పథకాల లబ్ధిదారులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెక్కులను మంజూరు చేసింది. ప్రస్తుత ప్రభుత్వం చెక్కుల పంపిణీని సైతం రాజకీయం చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా కల్యాణలక్ష్మి/షాదీముబారక్ పథకాలకు వచ్చిన దరఖాస్తులను తొలుత తహసీల్దార్, ఆ తరువాత ఆర్డీవో పరిశీలిస్తారు. లబ్ధిదారులను ఎంపిక చేసి చెక్కులను అందజేస్తారు. 14,865 మందికి చెక్కులు మంజూరైనా పంపిణీ చేయకుండా పెండింగ్‌లో పెట్టగా, వీటిలో సగానికంటే ఎక్కువ 8,918 చెక్కులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలవే కావడం గమనార్హం. బీజేపీ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ చెక్కుల పంపిణీ జరగడం లేదు. మొత్తంగా 11 వేలకుపైగా చెక్కులు ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలవే కావడం గమనార్హం. ప్రభుత్వ వివక్షపూరిత పాలనకు సిద్దిపేట జిల్లానే నిదర్శనంగా నిలుస్తున్నది. జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. హుస్నాబాద్ డివిజన్లో మంత్రి పొన్నం ఎమ్మెల్యేగా ఉండగా, అక్కడ ఒక్క చెక్కూ పెండింగ్ లేదు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్‌లో 561, హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటలో 744 చెక్కులు పంపిణీ చేయకుండా పెండింగ్ పెట్టారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ జిల్లాలో సైతం ఒక్క చెక్కు కూడా పెండింగ్ లేవు.
చెక్కుల పంపిణీ చేయడంలో తీవ్ర తాత్సారం చేస్తుండటంతో పేదింటి తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా కల్యాణలక్ష్మి చెక్కులను ఆర్డీవోలు జారీ చేస్తారు. ఆ చెక్కులపై నిర్దేశిత తేదీని వేస్తారు. ప్రస్తుతం చెక్కుల గడువు ముగిసిన తరువాత కూడా పంపిణీ చేయని దుస్థితి నెలకొన్నదని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. చెక్కులను బ్యాంకులకు తీసుకెళ్తే బౌన్స్ అయ్యాయని చెప్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. దీంతో మళ్లీ చెక్కుల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షణ చేయాల్సి వస్తున్నదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెక్కుల పంపిణీ జాప్యానికి స్థానిక కాంగ్రెస్ నేతలే ప్రధాన కారణమని అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట చెక్కులను పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తే.. కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తేవడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీంతో అధికారులు సైతం ప్రొటోకాల్‌కు విరుద్ధంగా చెక్కులు పంపిణీ చేయడం పరిపాటిగా మారింది. ఫలితంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న చోట చెక్కులు పెండింగ్ పెట్టాల్సి వస్తున్నదని, దీంతో లబ్ధిదారులు నష్టపోతున్నారని అధికారులు వివరిస్తున్నారు.
కల్యాణలక్ష్మి పథకం కింద రూ.1,00,016 నగదుతోపాటు ఆడబిడ్డలకు పెండ్లిరోజునే తులం బంగారం కూడా అందజేస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పటివరకు మార్గదర్శకాలు విడుదల చేయలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో అమలయ్యే అవకాశం లేదని బడ్జెట్ కేటాయింపులు సూచిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు సంబంధించి బడ్జెట్లో ఈ ఏడాది ప్రభుత్వం రూ.3,855.12 కోట్లు ప్రతిపాదించింది. ఇందలో బీసీలకు రూ.2,185.51 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి విడతగా రూ.725 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినా ఆ నిధులే ఇప్పటివరకు పూర్తిగా జమకాలేదు. ప్రస్తుతం కేటాయించిన నిధులు లక్ష ఆర్థిక సాయానికి మాత్రమే సరిపోతాయని, తులం బంగారాన్ని ఇవ్వాలంటే బడ్జెట్ రెండింతలు చేయాల్సి ఉంటుందని అధికారుల అంచనా.
మహబూబాబాద్, ఆగస్టు 29(నమస్తే తెలంగాణ): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తార్సింగ్ తండాకు చెందిన భూక్యా భద్రు- నీల దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురు అనూష డిగ్రీ పూర్తి చేసింది. ఆమెకు 2023 జూన్ 4న ఇల్లందు మండలం మామిడిగుండ్ల గ్రామానికి చెందిన యువకుడితో వివాహం జరిపించారు. వివాహం చేసిన రెండు నెలల తర్వాత కల్యాణలక్ష్మి పథకానికి కేసముద్రం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. రోజూ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఇప్పటివరకూ చెక్కు రాలేదు. వారానికోసారి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి ‘సార్ మా చెకు వచ్చిందా?’ అని ఆరా తీస్తున్నారు. వెళ్లిన ప్రతిసారీ ‘బడ్జెట్ లేదు.. బడ్జెట్ రాగానే మీ చెకు వస్తుంది’ అని అధికారులు చెప్తున్నారు. వారు దరఖాస్తు చేసి 10 నెలలు కావొస్తున్నది.. ఇప్పటికైనా వీలైనంత త్వరగా తమకు కల్యాణలక్ష్మి చెకు ఇప్పించాలని వారు వేడుకుంటున్నారు.
నేను, నా భార్య మహ్మద్ యాదాంబీ వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నాం. మా చిన్న కూతురు మహ్మద్ ఫౌజియా వివాహం గత సంవత్సరం మే 3న చేశాం. షాదీముబారక్ డబ్బులు రాగానే అల్లుడికి కూడా కానుకలు పెడతామని పది మందిలో ఒప్పుకున్నాం. నా బిడ్డ పెండ్లి అయి 16 నెలల గడుస్తున్నది. నా బిడ్డకు ఇటీవల సంతానం కలిగి మాకు మనుమరాలు వచ్చింది. షాదీముబారక్ డబ్బులు మాత్రం రాలేదు. షాదీముబారక్ చెక్కుల కోసం ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. గీ ప్రభుత్వం అసలు ఇస్తదో.. లేదోననే గుబులుగా ఉన్నది.
– మహ్మద్ గుంషావలి, రాయపర్తి, వరంగల్