మేడ్చల్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): రుణమాఫీ వర్తింపుకాని రైతుల కోసం ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కమిటీతో ఎలాంటి ఫలితం లేదని రైతులు మండిపడుతున్నారు. రెండు విడతలుగా రుణమాఫీకాని రైతులు గ్రీవెన్స్ కమిటీలో ఫిర్యాదులు చేస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లావ్యాప్తంగా బౌరంపేట్, దూలపల్లి, డబిల్పూర్, మేడ్చల్, కీసర, శామీర్పేట్, పూడూర్, ఘట్కేసర్, అల్వాల్లో సహకార సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల పరిధిలో ఇప్పటి వరకు 3,091 మంది రైతులకు రూ. 17 కోట్లు మాత్రమే రుణమాఫీ అయింది. రుణమాఫీకాని రైతులు 300 మంది గ్రీవెన్స్ కమిటీలో ఫిర్యాదులు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ సంఖ్య వేలల్లో ఉన్నా అధికారులు గోప్యంగా ఉంచుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదులు ఇచ్చిన రైతులకు ఎలాంటి సమాధానాలు అధికారులు ఇవ్వలేదని చెప్పారు. గ్రీవెన్స్ కమిటీలో రైతుల ఫిర్యాదులకు తక్షణమే స్పందించాలని కలెక్టర్ గౌతమ్ ఆదేశించినా కింది స్థాయి అధికారులు చర్యలు తీసుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నెల చివరివారంలో అందిస్తామన్న రూ.2 లక్షల రుణమాఫీ ఎంత మందికి వర్తింపజేస్తారన్న ఆందోళన రైతుల్లో నెలకొన్నది.