Congress | హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తి భగ్గుమంటున్నది. ముఖ్యనేత ఆధిపత్యం మితిమీరుతున్నదని, పార్టీని వలసనేతలతో నింపుతున్నారని పాత రగిలిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాకపోయినా పార్టీ గెలుపు కోసం కృషి చేశామని, ఇప్పుడు కనీసం నామినేటెడ్ పదువులైనా ఇవ్వకపోతే ఎలా అని నిలదీస్తున్నారు. ఓపిక పడుతున్నకొద్దీ వివక్ష పునరావృతమవుతున్నదని నిప్పులుచెరుగుతున్నారు. కొందరు కొత్త నేతలకు కండువా కప్పుతున్నప్పుడే పదవులు కట్టబెడుతున్నారని రగిలిపోతున్నారు. వీరంతా అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
మళ్లీ మొదలైన నామినేటెడ్ లొల్లి
కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల లొల్లి మళ్లీ మొదలైంది. కొత్తగా నియమించే 60 పదవులకు గాను 250 మందికి పైగా పోటీ పడుతున్నారు. ఇందులో ఒకటైన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ పదవిని దేవరకద్ర తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డికి కట్టబెట్టనున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఉద్దేశపూర్వకంగానే ముఖ్యనేతకు అనుకూలమైన మీడియాలో లీకులు కూడా ఇచ్చారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బాలల హక్కుల కోసం కృషి చేసిన వారికే ఈ పదవి ఇవ్వాలని, సీతాదయాకర్‌రెడ్డికి అర్హత లేదని జయాకర్రావు అనే న్యాయవాది అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.
మేమేం చేశాం నేరం?
ఎన్నికల్లో వలస నేతలకు టికెట్లు ఇచ్చారని, తమకు టికెట్ రాకపోయినా భవిష్యత్‌లో న్యాయం చేస్తామంటే నమ్మామని పాత నేతలు గుర్తుచేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ నుంచి వచ్చిన జితేందర్‌రెడ్డికి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్‌రెడ్డి తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ పదవి కట్టబెట్టారని చెబుతున్నారు. మాజీమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీలో చేరగానే వ్యవసాయ సలహాదారుడిగా నియమించారని, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారని అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
ఇక మాకు పదవులే ఇవ్వరా?
రాష్ట్రవ్యాప్తంగా గతంలో 37 కార్పొరేషన్ల పదవులు కూడా వలసనేతలతో నింపారని పాత కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారు. వీటిని రద్దు చేయాలంటూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారితో పాటు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీకి ఫిర్యాదు చేశానని ఓ సీనియర్‌నేత వెల్లడించారు. తాజాగా చేపట్టనున్న 60 పదవులను కూడా వలసనేతలకు ఇప్పించుకునేందుకు ముఖ్యనేత తెరవెనుక రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ సారి ఊరుకునే ప్రసక్తే లేదని, పాత కాంగ్రెస్ నేతలకు తగిన న్యాయం చేయాల్సిందేనని తేల్చిచెబుతున్నారు.