NIMS | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నది. దశాబ్దకాలంలో 1,000కి పైగా కిడ్నీ మార్పిడులు నిర్వహించి ప్రత్యేకతను చాటుకున్నది. ఒకప్పుడు నిరుపేద రోగులకు అందని ద్రాక్షగా ఉన్న అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలను కేసీఆర్ సర్కార్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవడంతో నిరుపేదలకు పైసా ఖర్చు లేకుండా అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు అందుతున్నాయి. ఈ క్రమంలోనే 2014లో కేసీఆర్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు అనూహ్యంగా పెరిగాయి. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వేలాది మంది నిరుపేద రోగులకు పునర్జన్మ ప్రసాదిస్తున్నది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పాలనలో 971 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగినట్టు నిమ్స్ యూరాలజీ విభాగం వెల్లడించింది. దేశ చరిత్రలోనే ప్రభుత్వ వైద్యరంగంలో ఎక్కడా లేని విధంగా ఒకే సెంటర్లో ఇంత పెద్ద సంఖ్యలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరగడం ఇదే రికార్డు అని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, యురాలజీ విభాగాధిపతి డాక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. 2024 జనవరి నుంచి అక్టోబర్ 10 వరకు అంటే దాదాపు 10 నెలల కాలంలోనే 101 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తిచేసినట్టు వారు వెల్లడించారు. నిమ్స్‌లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు ప్రారంభమైన 1989 నుంచి 2014 అక్టోబర్ అర్ధమాసం వరకు మొత్తం 1,731 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను నిర్వహించినట్టు నిమ్స్ అధికారులు వెల్లడించారు.
కేసీఆర్ హయాంలోనే ఆరోగ్యశ్రీ వర్తింపు
లక్షలాది రూపాయల ఖర్చుతో కూడిన అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయించుకోలేక ఎందరో నిరుపేద రోగులు మృత్యువాత పడటాన్ని చూసి తట్టుకోలేక నాటి కేసీఆర్ సర్కార్ ఖరీదైన అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో నిరుపేద రోగులు సైతం ఖైరీదైన అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకుని పునర్జీవనాన్ని పొందుతున్నారు. ఈ క్రమంలోనే మూత్రపిండ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులు అత్యధిక సంఖ్యలో పైసా ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకోగలుగుతున్నారు. దీనివల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు నెలకు రెండంకెలకే పరిమితమైన కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సల సంఖ్య కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెలకు మూడంకెలకు చేరుకున్నది. కానీ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 ఏండ్లలో 971 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరగడం ప్రజావైద్యంపై నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చొరవకు నిదర్శనం.
పదేండ్లలో రూ.160 కోట్లతో వైద్యం
ఒక కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ శస్త్రచికిత్సకు కార్పొరేట్లో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చవుతుందని, నిమ్స్‌లో పైసా ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఏటా కనీసం 100 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్టు నిమ్స్ యురాలజీ విభాగాధిపతి డాక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. ఈ క్రమంలో గడిచిన పదేండ్లలో నాటి కేసీఆర్ సర్కార్ సుమారు రూ.160 కోట్ల విలువైన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను పేద రోగులకు పూర్తి ఉచితంగా నిర్వహించింది.
కేసీఆర్ హయాంలో ఏటా 100 ఆపరేషన్లు
కేసీఆర్ సర్కార్ హయాంలో నాటి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా హరీశ్‌రావు నిరుపేదల వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో నిమ్స్‌లో ఏటా కనీసం 100 కిడ్నీ మార్పిడీ ఆపరేషన్లు జరగడం ఆనవాయితీగా మారింది. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన మౌలిక వైద్య సధుపాయాలు, అత్యాధునిక పరికరాలు, రోగులకు ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ వంటి ఆరోగ్య పథకాలతో ఒక్క నిమ్స్ దవాఖానలోనే పెద్ద సంఖ్యలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇదే కాకుండా ఉస్మానియా, గాంధీలో సైతం కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. అయితే నిమ్స్‌లో మాత్రం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఒకేరోజు రెండు లేదా అంతకంటే ఎక్కువ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్స్ కూడా చేశామని, అలాంటివి దాదాపు 10 ప్రత్యేక సందర్భాలు ఉన్నందునే ఇంత తక్కువ సమయంలో ఎక్కువ ట్రాన్స్‌ప్లాంట్స్ చేయగలుగుతున్నామని డాక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. ఢిల్లీలోని ఎయిమ్స్ వంటి సంస్థల్లో ట్రాన్స్‌ప్లాంట్ చేసేందుకు ప్రత్యేక విభాగం, ప్రత్యేక వైద్య బృందం పనిచేస్తుంది. కానీ నిమ్స్‌లో మాత్రం యూరాలజీ విభాగంలోనే సంబంధిత వైద్యబృందం ఒకపక్కన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్స్ చేస్తూనే మరోపక్క ఇతర యూరాలజీ సంబంధిత ప్రొసీజర్లను నిర్వహిస్తున్నదని, ఈ క్రమంలో ప్రతి నెలా 800 నుంచి 900 యూరాలజి ప్రొసీజర్స్‌ను జరుపుతున్నట్లు డాక్టర్ రాహుల్ దేవరాజ్ వివరించారు.
జీవితకాలం ఉచితంగా మందులు
కిడ్నీ మార్పిడి చేయించుకున్న రోగులు తప్పనిసరిగా ఇమ్యూనోసప్రేషన్ మందులు వాడాల్సి ఉంటుంది. ఈ మందులను రోగి జీవితకాలం వాడాల్సి ఉంటుంది. ఈ మందులకు ప్రతినెలా రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చవుతుంది. ఈ మందులను కూడా నిమ్స్‌లో కిడ్నీ మార్పిడి చేయించుకున్న రోగులకు జీవితకాలం పాటు పూర్తి ఉచితంగా అందచేస్తున్నట్టు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, డాక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. బీరప్ప సహకారంతో యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ రాహుల్ దేవరాజ్ ఆధ్వర్యంలో పలువురు డాక్టర్ల సహకారంతో ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లను విజయవంతంగా జరిపినట్టు అక్కడి వైద్యులు వెల్లడించారు. వైద్యచికిత్సలు, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ వంటి అవయవ మార్పిడి శస్త్రచికిత్సలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహాకు నిమ్స్ వైద్యబృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.