హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్‌బజార్: ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు టీఎస్ ఆర్టీసీ అన్ని చర్యలు తీసుకుంటున్నదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చెప్పారు. నిరుడు 100 బస్టాండ్లను ఆధునీకరించగా.. ఈ ఏడాది 150 బస్టాండ్లను ఆధునీకరించేందుకు సంస్థ ప్రణాళిక రూపొందించదని చెప్పారు. హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ (ఎంజీబీఎస్)ను మంగళవారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో కలిసి మంత్రి మంగళవారం తనిఖీ చేశారు. టీఎస్ఆర్టీసీ కల్పిస్తున్న సౌకర్యాలను ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత రంగారెడ్డి రీజియన్‌పై ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. గత ఏడాది రూ.1900 కోట్ల నష్టాన్ని సంస్థకు తగ్గించగలిగామని గుర్తుచేశారు. ఇప్పటికే 760 కొత్త బస్సులను కొనుగోలు చేశామని చెప్పారు. త్వరలోనే హైదరాబాద్‌లో నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని, ఇప్పటి వరకు ఏడు డీఏలను ప్రకటించామని, కార్మికుడి వేతనం 35 శాతం వరకు పెరిగిందని చెప్పారు. టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. టికెట్ ఆదాయాన్ని పెంచుకుంటూనే.. టికెటేతర ఆదాయంపై సంస్థ దృష్టి సారించిందని వెల్లడించారు. ఎంజీబీఎస్ ప్రాంగణంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఎండీతో కలిసి మంత్రి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 101 ప్రాంతాల్లో సామాజిక బాధ్యతగా రక్తదానం చేసిన 8 వేల మంది సిబ్బందికి అభినందనలు తెలిపారు. కార్యక్రమాల్లో టీఎస్ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పురుషోత్తం, మునిశేఖర్, కృష్ణకాంత్, రంగారెడ్డి ఆర్ఎం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.