హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత ప్రభావం ఏమాత్రం తగ్గటం లేదు. దీంతో చలికి ప్రజలు గజగజలాడుతున్నారు. ఈ మేరకు రానున్న మూడ్రోజులు మరింత చలిగాలులు వీచే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టు వెల్లడించింది. ముఖ్యంగా కుమ్రం భీం ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, రంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, నిర్మల్ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. చలిగాలుల కారణంగా చిన్న పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప ఉదయం, రాత్రి వేళల్లో ప్రయాణాలు చేయరాదని సూచించింది.
అత్యల్పంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యూ)లో 7.6 డిగ్రీలు కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు వెల్లడించింది. సంగారెడ్డి జిల్లా కోహీర్లో 8.2, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో 8.9, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో 9.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు తెలిపింది. మిగతా 31 జిల్లాల్లో 10 నుంచి 13.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వివరించింది. చలి తీవ్రతకు ఓ వృద్ధుడు మరణించాడు. పెద్దపల్లి జిల్లాలో నాలుగైదు రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయి చలిగాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో ఓదెల మండలం కనగర్తి గ్రామానికి చెందిన గాండ్ల మల్లయ్య (85) రెండు రోజులుగా చలితో వణుకుతూ సోమవారం మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.