బుధవారం 30 సెప్టెంబర్ 2020
Telangana - Aug 29, 2020 , 16:28:06

జిల్లా అభివృద్ధికి మ‌రిన్ని కేంద్ర నిధులు రాబ‌ట్టాలి : మ‌ంత్రి ఎర్ర‌బెల్లి

జిల్లా అభివృద్ధికి మ‌రిన్ని కేంద్ర నిధులు రాబ‌ట్టాలి : మ‌ంత్రి ఎర్ర‌బెల్లి

జ‌న‌గామ : కేంద్ర నిధులు మ‌రిన్నిరాబ‌ట్ట‌డం ద్వారా జిల్లా స‌మ‌గ్ర అభివృద్ధికి కృషి చేయాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఎంపీలు, క‌లెక్ట‌ర్, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధుల‌కు సూచించారు. జ‌న‌గామ జిల్లా అభివృద్ధి స‌మ‌న్వ‌య ప‌ర్య‌వేక్ష‌ణ క‌మిటీ (దిశ‌) స‌మావేశం జ‌న‌గామ జిల్లా క‌లెక్ట‌రేట్ లో శ‌నివారం జ‌రిగింది. ఈ స‌మావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ... కేంద్ర ప‌థ‌కాల్లో మ‌నం ముఖ్యంగా ఈజిఎస్ పథ‌కాన్ని ఎక్కువ‌గా వాడుకుంటున్నామ‌న్నారు. ఈ ప‌థ‌కంలో నిర్ణీత టార్గెట్ల‌ను పూర్తి చేసుకున్నామన్నారు. మ‌రిన్ని నిధుల కోసం ఇప్ప‌టికే కేంద్రాన్ని కోరామ‌ని చెప్పారు. ఇలాంటి ప‌రిస్థితి మిగ‌తా అన్ని కేంద్ర‌ ప‌థ‌కాల్లోనూ ఉండాల‌న్నారు. 

ఆయా నిధులు రాబ‌ట్ట‌డానికి జిల్లా అభివృద్ధి స‌మ‌న్వ‌య ప‌ర్య‌వేక్ష‌ణ క‌మిటీ (దిశ‌)కి చైర్మన్‌గా ఉన్న ఈ జిల్లా ప‌రిధిలోని ఎంపీ, కో చైర్మన్‌గా ఉన్న రాజ్య‌స‌భ స‌భ్యులు,  స‌భ్య కార్య‌ద‌ర్శిగా ఉన్న క‌లెక్ట‌ర్ స‌మ‌న్వ‌యంతో కృషి చేయాల‌న్నారు. ఆ దిశ‌గా ఈ దిశ న‌డ‌వాల‌ని అన్నారు. రాష్ట్రం నుంచి వ‌చ్చే నిధులు, ప‌థ‌కాల‌కు తోడు కేంద్ర ప్ర‌భుత్వానివి తోడైతే మ‌రింత అభివృద్ధిని సాధించ‌డానికి వీల‌వుతుంద‌ని మంత్రి అన్నారు. ఈ స‌మావేశంలో జెడ్పీ చైర్మ‌న్ పాగాల సంప‌త్ రెడ్డి, ఎంపీలు ప‌సునూరి ద‌యాక‌ర్, బండ ప్ర‌కాశ్, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాద‌గిరిరెడ్డి, తాటికొండ రాజ‌య్య‌, జిల్లా క‌లెక్ట‌ర్ నిఖిల, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు, వివిధ శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు. logo