హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : నైరుతి రుతుపవనాల మందగమనంతో రాష్ట్రంలో కొన్ని రోజులుగా తీవ్ర వడగాలులు, ఉకపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. రుతుపవనాలు ఈ నెల 21న తిరిగి పుంజుకొని పలు ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమై, 23 నాటికి రాష్రమంతా విస్తరించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం రుతుపవనాలు ఉత్తర సరిహద్దు హైదరాబాద్, భద్రాచలం ప్రాంతాల చుట్టుపకల నిలిచిపోయాయని, వాతావరణంలో మార్పులతో నాలుగు రోజుల్లో మిగిలిన జిల్లాల్లోకి ప్రవేశించి వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపారు.
ఈ ఏడాది జూన్లో సగటున 30 శాతం లోటు వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యం గా నిజామాబాద్, మహబూబాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, సిద్దిపేట, పెద్దపల్లి, హ నుమకొండ జిల్లాల్లో 60 నుంచి 80 శాతం లోటు వర్షపాతం నమోదైనట్టు పేర్కొన్నది. నాగర్కర్నూల్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లా ల్లో మాత్రమే అధిక వర్షపాతం నమోదు కా గా, మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం న మోదైనట్టు తెలిపారు. గడిచిన 24 గంటల్లో సూర్యాపేటలో 5.08 సెం.మీ, నల్లగొండలో 5.01, హైదరాబాద్లో 4.24, యాదాద్రి-భువనగిరిలో 4.01, నాగర్కర్నూల్లో 3.25 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.