Telangana | వనపర్తి, జూన్ 12 (నమస్తే తెలంగాణ): వానకాలం పంటల సీజన్ ప్రారంభమైంది. రుతుపవనాల ప్రభావంతో వర్షాలు ముందుగానే కురుస్తున్నాయి. రైతులు విత్తనాల కొనుగోలు బాట పట్టారు. విత్తనాలను తెలంగాణ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిద్ధం చేసి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు పంపిణీ చేయనున్నది.
ఆయా జిల్లాల వ్యవసాయ శాఖల ఇండెంట్ మేరకు విత్తనాలు తరలించి రైతులకు విక్రయిస్తారు. నాసిరకం విత్తనాల బాధలు అధికం కావడంతో టీజీ సీడ్స్‌పై రైతులు నమ్మకం పెట్టుకున్నారు. వనపర్తి సీడ్స్ కర్మాగారంలో ఈ ఏడాది దాదాపు 22 వేల క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలను ప్రాసెసింగ్ చేసేలా కార్యాచరణ చేపట్టారు. వీటిలో దాదా పు ప్రాసెసింగ్ పనులు పూర్తయ్యాయి. అయి తే, ఇతర జిల్లాలకు సీడ్స్‌ను తరలించడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
వరి విత్తనాలు లేవంటూ బోర్డు
ప్రస్తుత సీజన్‌కు సంబంధించి నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి సమీపంలోని పాలెం వ్యవసాయ పరిశోధనా కేంద్రంలోనూ విత్తనాలు అందుబాటులో ఉంచారు. కానీ పక్షం రోజుల నుంచి వరి విత్తనాలు అయిపోయాయని కేంద్రం నిర్వాహకులు బోర్డు పెట్టేశారు. సీజన్ మొదలుగాక ముందే విత్తనాలు అయిపోయాయని బోర్డులు పెట్టడంతో కర్షకులు ఆందోళన చెందుతున్నారు. నాణ్యమైన విత్తనాల కోసం రైతులు ఎంత దూరమైనా వెళ్లేందుకు లెక్కచేయడం లేదు.
పాలెం పరిశోధనా కేంద్రం వద్దకు తెలకపల్లి మండలం లక్నారం గ్రామానికి చెందిన రైతుల బృందం పది రోజులపాటు తిరిగింది. విత్తనాలు రావని తెలుసుకొని వనపర్తిలోని తెలంగాణ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేంద్రానికి వచ్చారు. వరి బీపీటీ రకం 40 బస్తాల విత్తనాలను కొనుగోలు చేసి ఆటోలో తీసుకెళ్లారు. ఇక్కడి నుంచి వారి గ్రామానికి దాదాపు 70 కిలోమీటర్లు దూరం ఉంటుంది. లక్నారం గ్రామం మండల కేంద్రమైన తెలకపల్లికి కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడికి ప్రభుత్వమే విత్తనాలు సరఫరా చేయాల్సి ఉన్నా.. అధికారుల నిర్లక్ష్యంతో వనపర్తి సెంటర్‌ను ఆశ్రయించామని రైతులు నిరంజన్, శంకర్రావు, ఎల్లయ్య, రామారావు, హనుమంత్‌రెడ్డి తెలిపారు.
ముందే బోర్డు పెట్టిండ్రు
గతంలో తెల్కపల్లిలోనే మాకు వరి విత్తనాలు అందుబాటులో ఉండేవి. అక్కడ లేకుంటే పాలెంలోనైనా దొరికేవి. ఈసారి అక్కడ కూడా విత్తనాలు అయిపోయావని బోర్డు పెట్టేశారు. ఇక మాకు దిక్కుతోచలేదు. ఒక్క కుంట కూడా నీటితో నిండలేదు.. చెరువుల్లోకి నీళ్లే రాలేదు.. కాల్వలు పారనేలేదు. కానీ విత్తనాలు అయిపోయాయని సర్కారోళ్లు బోర్డు పెట్టిండ్రు. నాణ్యమైన విత్తనాల కోసమే 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న వనపర్తి సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు వెళ్లి కొనుగోలు చేశాం. అంత దూరం వెళ్లడం మాకు ఆర్థికంగా భారమే.. అయినా తప్పదు.
– నిరంజన్, లక్నారం, తెలకపల్లి మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా
విత్తనాలు సిద్ధం
తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ నిర్ణయించిన లక్ష్యాలను గడువులోపు సిద్ధం చేశాం. మాకిచ్చిన ఇండెంట్ మేరకు విత్తనాలను రెడీగా ఉంచాం. ప్రధానంగా వరి ప్రాసెసింగ్, ప్యాకింగ్ పూర్తయింది. ఆయా ప్రాంతాల వారీగా వాహనాలు వస్తే వరి వంగడాలను పంపిస్తున్నాం. ఇక్కడి నుంచి దాదాపు 22 వేల క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలను ఈ ఏడాది వానకాలంలో రైతుల అవసరాలకు అందించాలన్న లక్ష్యంగా నిర్ణయించాం.
– రాజీవ్, మేనేజర్, టీజీఎస్‌డీసీ, వనపర్తి
విత్తనాలు ఇయ్యకుంటే ఎట్లా ?
వరి విత్తనాలు ఇ య్యకుంటే సాగు ప నులు ఎలా చేయాలి. మంచి విత్తనమైతే పంట బాగా వస్తుం ది. ప్రైవేటులో కొందామంటే నమ్మకం లేదు. పది రోజుల నుం చి విత్తనాల కోసం పాలెం సెంటర్‌కు తిరిగి వేసారినం. వస్తాయంటే ఎదురు చూసి నం. అయినా విత్తనాలు లేవని బో ర్డు పె ట్టిండ్రు. ఎంత కష్టమైనా నాణ్యమైన విత్తనాలు వనపర్తిలో లభిస్తాయంటే వనపర్తికి వచ్చాం. కాంగ్రెస్ సర్కారు వచ్చిందిగానీ.. రైతులకు ఫలితం లేదు. ఇట్ల విత్తనాలకు ఇంత దూరం మేం ఎప్పుడు రాలె.
– ఎల్లయ్య, లక్నారం, తెలకపల్లి మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా